సిప్​లకే ఇన్వెస్టర్ల ఓటు:మ్యూచువల్​ఫండ్లలోకి భారీగా పెట్టుబడులు

సిప్​లకే ఇన్వెస్టర్ల ఓటు:మ్యూచువల్​ఫండ్లలోకి భారీగా పెట్టుబడులు
  • ఆగస్టులో ఆల్​టైం హైకి చేరిక
  •  రూ. 23,547 కోట్లకు పెరిగిన పెట్టుబడులు
  • వెల్లడించిన ఆంఫీ రిపోర్ట్

న్యూఢిల్లీ: సిస్టమాటిక్​ఇన్వెస్ట్​మెంట్​ప్లాన్​(సిప్​) విధానం ద్వారా మ్యూచువల్​ఫండ్లలోకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఆగస్ట్‌‌‌‌‌‌‌‌లో తమ వృద్ధిని కొనసాగించి రూ. 38,239 కోట్లను ఆకర్షించగా, వీటిలో రూ.23,547 కోట్లు సిప్​ పద్ధతిలో వచ్చాయి. ఇది ఆల్​టైం హై! థీమాటిక్ ఫండ్‌‌‌‌‌‌‌‌ల నుంచి కూడా బలమైన సహకారం ఉంది. సిప్​లు పెరగడానికి కొత్త ఫండ్ ఆఫర్లు (ఎన్​ఎఫ్​ఓలు) కూడా కారణమే.

జులైలో వచ్చిన రూ. 37,113 కోట్ల నికర ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోల కంటే ఆగస్టులో వచ్చినవి దాదాపు 3.3శాతం ఎక్కువని, అయితే ఆగస్టులో రూ. 40,608 కోట్ల నికర ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో ఉందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) మంగళవారం వెల్లడించింది. మంత్లీ సిప్​లు ఆగస్టులో రూ.23,332 కోట్ల నుంచి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ.23,547 కోట్లకు చేరాయి.

దీర్ఘకాలిక సంపద సేకరణ వైపు మళ్లుతున్న పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతుందని చెప్పడానికి ఇది నిదర్శనమని ఆంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. ఈక్విటీ ఫండ్లలో వరుసగా 42వ నెలలో నికర ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోలు పెరిగాయి. యూనియన్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధు నాయర్ మాట్లాడుతూ 2024 ఆగస్టు నెలలో ఈక్విటీ ఫ్లోలలో సిప్​ ఫ్లోలు, ఎన్​ఎఫ్​ఓలు  ఇప్పటికే ఉన్న స్కీమ్‌‌‌‌‌‌‌‌ల పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు.

మొత్తం రూ. 66.7 లక్షల కోట్లు 

మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఈ ఏడాది జులైలో రూ. 1.9 లక్షల కోట్ల ఇన్​ఫ్లోలను రాబట్టగా, ఆగస్టులో రూ. 1.08 లక్షల కోట్లు వచ్చాయి. ఈ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోలతో నిర్వహణలో ఉన్న పరిశ్రమ నికర ఆస్తులు జులై -ఆఖరులో రూ. 65 లక్షల కోట్ల నుంచి ఆగస్టు చివరిలో రూ. 66.7 లక్షల కోట్లకు.. ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈక్విటీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. 

గత నాలుగు నెలల్లో స్థిరంగా రూ. 34 వేల కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో ఉంది. ఫోకస్డ్  ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లు కేటగిరీలు మినహా, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ అండ్​ మిడ్ క్యాప్, మిడ్ క్యాప్,  స్మాల్ క్యాప్ వంటి అన్ని ఇతర కేటగిరీలు మంచి నికర ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోలను సాధించాయి.  

థీమాటిక్ ఫండ్‌‌‌‌‌‌‌‌లు ఆగస్టులో అత్యధికంగా రూ. 18,117 కోట్ల నికర ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోలతో పెట్టుబడిదారులను ఆకర్షించాయి.  ఫోలియోల సంఖ్య జులైలో 19.84 కోట్ల నుంచి ఆగస్టులో 20 కోట్ల మార్కును అధిగమించింది. ఈక్విటీ ఫోలియోలు కూడా 3.16శాతం పెరిగి 14.3 కోట్లకు చేరుకున్నాయి.