- ఇండియాలో తయారీ చేపట్టేలా ప్రోత్సహించాలి
- ఎగుమతులు పెంచుకోవాలి
- చైనీస్ ప్లస్ స్ట్రాటజీలో ఇదే బెటర్ ఆప్షన్ : నీతి ఆయోగ్ మెంబర్ అర్వింద్ విర్మాని, ఎకనామిక్ సర్వే
న్యూఢిల్లీ: చైనా నుంచి ప్రొడక్ట్‌లను దిగుమతి చేసుకోవడం కంటే ఆ ప్రొడక్ట్‌లను తయారు చేసే కంపెనీలు ఇండియాలో తయారీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. బడ్జెట్ ముందు విడుదలైన ఎకనామిక్ సర్వే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చైనా నుంచి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఎఫ్‌డీఐ) పెరిగేలా చూడాలని, లోకల్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌ను బలోపేతం చేసి ఎగుమతులు పెంచుకోవాలని పేర్కొంది.
ఇదే అభిప్రాయాన్ని నీతి ఆయోగ్ మెంబర్ అర్వింద్ విర్మాని ఆదివారం వ్యక్తం చేశారు. ‘చైనా నుంచి గత పదేళ్లు, పదిహేనేళ్ల నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం. దిగుమతులు తప్పవు అనుకుంటే చైనీస్ కంపెనీలు ఇండియాలోనే ఈ ప్రొడక్ట్‌లను తయారు చేసేలా చూడడం బెటర్’ అని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. యూఎస్, యూరోపియన్ కంపెనీలు చైనా నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని చూస్తున్న ప్రస్తుత తరుణంలో, ఇండియాలో చైనీస్ కంపెనీలు తయారీ మొదలు పెట్టడం ఉత్తమమం.
మన దగ్గర నుంచి ప్రొడక్ట్‌లను ఎగుమతి చేయగలుగుతాయి. ‘చైనా ప్లస్ వన్’ స్ట్రాటజీ నుంచి ఇండియా రెండు విధాలుగా ప్రయోజనం పొందొచ్చు. చైనా సప్లయ్ చెయిన్‌లో ఇండియా కూడా ఇంటిగ్రేట్ కావడం. లేదా చైనా నుంచి ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించడం. చైనా నుంచి దిగుమతులకు అనుమతివ్వడం కంటే ఇది బెటర్ అని విర్మాని అన్నారు. పైన పేర్కొన్న రెండు ఛాయిస్‌లలో ఎఫ్‌డీఐలను ఆకర్షించడంపై ఆయన మొగ్గు చూపారు. ఎఫ్‌ఐడీలు ఆకర్షిస్తే ఇండియా నుంచి యూఎస్‌కు ఎగుమతులు పెరుగుతాయని అన్నారు.
అంతేకాకుండా ఎఫ్‌డీఐలపై ఆధారపడడం వలన చైనీస్ ప్లస్ స్ట్రాటజీ మరింత సమర్ధవంతంగా అమలు చేయొచ్చని తెలిపారు. ఎందుకంటే చైనా నుంచి ఇండియా భారీగా దిగుమతులు చేసుకుంటోందని, ఈ దేశంతో మన ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువగా ఉందని వివరించారు. కాగా, 2000 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య చైనా నుంచి 2.5 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు ఇండియాలోకి వచ్చాయి. ఎఫ్‌డీఐలు చేసిన టాప్ దేశాల్లో చైనా 22 వ స్థానంలో ఉంది. ఇండియాలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఇది కేవలం 0.37 శాతం వాటాకు సమానం.
ఇండియాలోకి చైనా ఇన్వెస్ట్‌మెంట్లు తక్కువగా ఉన్నా, ఇరు దేశాల మధ్య వాణిజ్యం మాత్రం భారీగా పెరిగింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో 118.4 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం జరిగింది. ఇండియా నుంచి చైనాకు ఎగుమతులు 8.7 శాతం గ్రోత్ సాధించి 16.67 బిలియన్ డాలర్లకు చేరుకున్నా, చైనా నుంచి దిగుమతులు మాత్రం ఏకంగా 101.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ట్రేడ్ డెఫిసిట్ ఏకంగా 85 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇండియా-చైనా మధ్య గొడవ తగ్గితేనే..
ఇండియా–చైనా మధ్య గల్వాన్ వ్యాలీలో 2020 జూన్‌లో గొడవ నెలకొంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. బార్డర్‌లో శాంతియుత వాతావరణం నెలకొంటే తప్ప చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోమని ఇండియా ప్రకటించింది. గల్వాన్ గొడవ తర్వాత ఇండియాలోని 200 చైనీస్ మొబైల్ యాప్‌లను ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇందులో టిక్‌టాక్, వీచాట్, అలిబాబా, యూసీ బ్రౌజర్ వంటి ఫేమస్ యాప్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ బీవైడీ ఇండియాలో పెట్టుబడులు పెడతామంటే ప్రభుత్వం తిరస్కరించింది. కానీ, లోకల్ కంపెనీలతో కలిసి పెట్టుబడులు పెట్టడానికి అనుమతిచ్చింది. తాజాగా చైనీస్ కంపెనీ ఎస్‌ఏఐసీ మోటార్ సబ్సిడరీ ఎంజీ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 38 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఈ ఏడాది ప్రారంభంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.