![8 సెషన్లలో 25 లక్షల కోట్లు ఉఫ్..ట్రంప్ టారిఫ్ వార్‌తో మార్కెట్ కుదేలు](https://static.v6velugu.com/uploads/2025/02/investors-lose-over-rs-25-lakh-crore-as-dalal-street-remains-red-for-8th-consecutiv-day_vy3jDBa472.jpg)
- 12 శాతం మేర పడ్డ మిడ్, స్మాల్ క్యాప్‌లు
- కొనసాగుతున్న ఎఫ్‌ఐఐల అమ్మకాలు
యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ ప్రమాణం చేసినప్పటి నుంచి ఇన్వెస్టర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. గ్లోబల్‌గా టారిఫ్ వార్‌కు తెరతీయడంతో ఇండెక్స్‌లు కుదేలవు తున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ వరుసగా ఎనిమిది సెషన్లలో నష్టాల్లోనే ముగిసింది. ఇన్వెస్టర్లకు రూ.25 లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. లార్జ్ క్యాప్ కంటే స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లకు ఎక్కువ నష్టాలను మిగిల్చాయి.
ముంబై: ఇండియన్ స్టాక్‌మార్కెట్ వరుసగా ఎనిమిదో సెషన్‌లోనూ పడింది. ఇన్వెస్టర్లకు రూ.25.31 లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్ షేర్ల పతనం ఆగడం లేదు. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్‌లు గత 8 సెషన్లలో 12 శాతం వరకు పతనమయ్యాయి. ఇదే టైమ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ 3 శాతం చొప్పున పడ్డాయి.
ఈ ఇండెక్స్‌లు శుక్రవారం కూడా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు (0.26 శాతం) తగ్గి 75,939 దగ్గర సెటిలయ్యింది. ఇంట్రాడేలో 700 పాయింట్ల వరకు పడింది. నిఫ్టీ 102 పాయింట్లు తగ్గి 22,929 దగ్గర ముగిసింది. ట్రంప్ టారిఫ్ వార్ మొదలుపెట్టడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటే ఇండియన్ మార్కెట్లు కూడా గత కొన్ని రోజులుగా నష్టపోతున్నాయి. అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై అదనంగా 25 శాతం టారిఫ్‌ను యూఎస్ ప్రభుత్వం వేసింది. వీటికి తోడు ఫార్మా, వెహికల్ దిగుమతులపై కూడా టారిఫ్‌లు పెంచుతామని, ‘పరస్పర టారిఫ్’ కూడా వేస్తామని ప్రకటించింది. టారిఫ్‌లు పెరిగితే ఇండియన్ కంపెనీల లాభాలు భారీగా తగ్గుతాయి. గత ఎనిమిది సెషన్లలో సెన్సెక్స్ 2,645 పాయింట్లు (3.36 శాతం) పతనమవ్వగా, నిఫ్టీ 810 పాయింట్లు (3.41 శాతం) నష్టపోయింది. ఫలితంగా బీఎస్‌ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.25 లక్షల కోట్లు తగ్గి రూ.400 లక్షల కోట్ల (4.61 ట్రిలియన్ డాలర్ల) దిగువకు పడింది.
కొనసాగనున్న నష్టాలు?
విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు (ఎఫ్‌ఐఐలు) మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో వెళ్లిపోతున్నాయి. శుక్రవారం సెషన్‌లో కూడా నికరంగా రూ.4,300 కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌ఐఐలు అమ్మారు. డాలర్ బలపడడం, రూపాయి విలువ జీవిత కాల కనిష్టాలకు పడడం, యూఎస్ బాండ్ ఈల్డ్‌లు పెరగడంతో ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) ఇండియన్ మార్కెట్ నుంచి తమ ఫండ్స్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నారు. పరస్పర టారిఫ్‌ల (తమపై ఎంత టారిఫ్ వేస్తే అంతే వేయడం) నుంచి ఇండియాకు మినహాయింపు ఉండదని ట్రంప్ ఇప్పటికే చెప్పేశారు. యూఎస్ పరస్పర టారిఫ్‌లను వేయడం మొదలు పెడితే గ్లోబల్‌గా ట్రేడ్ వార్ మరింతగా ముదురుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ‘ఇండియాతో సహా అన్ని దేశాలపైనా పరస్పర టారిఫ్‌లను వేస్తామని ట్రంప్ ఖరారు చేయడంతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ తగ్గుతోంది. టారిఫ్‌లపై అనిశ్చితి నెలకొంది.
దీనికి తోడు కంపెనీల డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ మెప్పించకపోవడంతో సెంటిమెంట్ దెబ్బతింటోంది. ఇండియన్ మార్కెట్ల వాల్యుయేషన్ కూడా ఎక్కువగా ఉంది. అందుకే ఎఫ్‌ఐఐలు షేర్లను పెద్ద మొత్తంలో అమ్మేస్తున్నారు’ అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ ఎనలిస్ట్ విష్ణుకాంత్ ఉపాధ్యాయ్ వివరించారు. కంపెనీల రిజల్ట్స్ మార్కెట్ అంచనాలను అందుకోకపోవడంతో రిస్క్ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు వెనకడుగేస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల ఫలితాలు మెప్పించలేకపోతున్నాయని పేర్కొన్నారు. ‘రిజల్ట్స్ బాగోకపోవడం, రూపాయి విలువ క్షీణించడంతో పాటు టారిఫ్‌లు వంటి గ్లోబల్ అంశాలు మార్కెట్‌ను పడేస్తున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ రానున్న సెషన్లలోనూ బలహీనంగా ఉంటుంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతాయి’ అని అంచనావేశారు.