
- వరుసగా ఆరో సెషనూ లాభాల్లోనే..రూ.27 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- 23,600 పైన నిఫ్టీ షార్ట్ టెర్మ్‌లో మార్కెట్ మరింత పెరిగే అవకాశం
ముంబై: విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) తిరిగి ఇండియన్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుండడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు వరుసగా ఆరో సెషన్‌లోనూ దూసుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం ఒకటిన్నర శాతం మేర ర్యాలీ చేశాయి. ఈ ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు పెరిగింది. గత ఆరు సెషన్లలో రూ.27.10 లక్షల కోట్లు ఎగిసింది. బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.418.49 లక్షల కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్ సోమవారం 1,079 పాయింట్లు (1.40 శాతం) లాభపడి 77,984 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 1,200 పాయింట్లు లాభపడి 78 వేల లెవెల్‌ను దాటింది కూడా. నిఫ్టీ ఇంట్రాడేలో 23,709 లెవెల్ వరకు పెరిగినా, చివరికి 308 పాయింట్ల లాభంతో 23,658 వద్ద సెటిలయ్యింది. నిఫ్టీలో కోటక్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
మార్కెట్ ఎందుకు పెరుగుతోందంటే?
1) కిందటేడాది సెప్టెంబర్ నుంచి ఈ నెల మధ్య వరకు నికర అమ్మకందారులుగా కొనసాగిన ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ), తిరిగి ఇండియా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. యూఎస్ ఫెడ్ ఈ ఏడాది రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తామని ప్రకటించడంతో అక్కడి బాండ్లలో కంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 21న నికరంగా రూ.7,400 కోట్ల విలువైన షేర్లను కొన్న ఎఫ్‌ఐఐలు, సోమవారం సెషన్‌లో మరో రూ.3 వేల కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. ‘ఎఫ్‌ఐఐల స్ట్రాటజీలో మార్పు కనిపిస్తోంది. వీరి అమ్మకాలు నెమ్మదించాయి. వీరు నికర కొనుగోలుదారులుగా మారడంతో మార్కెట్ పెరుగుతోంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.
2) వచ్చే నెల 2 నుంచి ఇండియా ప్రొడక్ట్‌లపై యూఎస్ ప్రభుత్వం టారిఫ్‌లు పెంచనుంది. అయినప్పటికీ ఇండియా ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్‌గా ఉండడం, మార్కెట్‌లు మంచి వాల్యుయేషన్‌లో ట్రేడవుతుండడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎఫ్‌ఐఐలు నికర కొనుగోలుదారులుగా మారడంతో గతంలో చేసిన షార్ట్ (పడుతుందని ట్రేడ్ చేయడం) పొజిషన్లు క్లోజ్ అవుతున్నాయి. ఫలితంగా బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ర్యాలీ చేస్తున్నాయి. ‘ కిందటి వారం నిఫ్టీ 4.6 శాతం పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రంప్ ప్రతీకార టారిఫ్‌ల భయాలు కొనసాగుతున్నా మార్కెట్ పెరగడం విశేషం. ఇండియాపై యూఎస్ ప్రభుత్వం ఎంత మేర టారిఫ్‌లు పెంచుతుందో ఏప్రిల్ 2 న తెలుస్తుంది. అనిశ్చితి కొనసాగుతుండడంతో మార్కెట్ బుల్లిష్‌గా ఉన్నా, ఇన్వెస్టర్లు జాగ్రత్త పడాలి’ అని విజయకుమార్ సలహా ఇచ్చారు.
3) యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పడుతుండడం మన మార్కెట్లకు కలిసొస్తోంది. 10 ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్లు ఇచ్చే రిటర్న్ 4.27 శాతం దగ్గర ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోని లెవెల్‌తో పోలిస్తే 40 బేసిస్ పాయింట్లు తక్కువకు ట్రేడవుతోంది. ట్రెజరీ ఈల్డ్స్ పడుతుండడంతో ఇండియా వంటి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే దేశాల వైపు విదేశీ ఇన్వెస్టర్లు చూస్తున్నారు.
4) నిఫ్టీ కీలక లెవెల్స్‌పైన ట్రేడవుతోంది. 23,600 రెసిస్టెన్స్‌ను ఈజీగా దాటింది. టెక్నికల్‌గా చూస్తే బోలింగర్ బ్యాండ్ అప్పర్ లెవెల్‌పైన గత కొన్ని సెషన్లుగా ట్రేడవుతోంది. 23,500 పైన ఉన్నంత వరకు నిఫ్టీ పెరుగుతుందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ రూపక్ దే అన్నారు. ఈ లెవెల్‌ను కోల్పోతే మార్కెట్ పడొచ్చన్నారు.