మే4న కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్లలో పద్మనాయక వెలమ కళ్యాణమండపం ఏసీ హాల్ కు భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి వెలమ కమ్యూనిటీకి చెందిన మంత్రులు, నేతలు హాజరుకానున్నారు. ఆహ్వానితుల జాబితాలో కేవలం వెలమ నాయకుల పేర్లే ఉండడం గమనార్హం. అందులోనూ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వెలమ మంత్రుల పేర్లు ఉండడం చర్చనీయాంశంగా మారింది.
ఈ కార్యక్రమానికి ఇతర కుల ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఇన్విటేషన్ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆహ్వాన పత్రికలో స్థానిక ఎమ్మెల్యే ( మంత్రి) గంగుల కమలాకర్ కు కూడా చోటు దక్కకపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వెలమ కుల సంఘ నిధులతోనే భవనం నిర్మిస్తున్నందున ఇతర కులాల నేతలను పిలవలేదని వెలమ నాయకులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నట్టు సమాచారం. ఇది ప్రైవేట్ కార్యక్రమంగా చెప్పుకుంటున్నప్పటికీ అధికారికంగా డీపీఆర్వో, జిల్లా అడ్మినిస్ట్రిషన్ గ్రూపుల్లో కార్యక్రమ ఆహ్వాన పత్రికలను అధికారులు సర్క్యూలేట్ చేస్తుండడంపై చర్చనీయాంశంగా మారింది.