T20 World Cup 2024: అర్షదీప్‌ కుట్ర పన్నాడు.. లేదంటే ఆస్ట్రేలియా గెలిచేది: ఇంజ‌మామ్

T20 World Cup 2024: అర్షదీప్‌ కుట్ర పన్నాడు.. లేదంటే ఆస్ట్రేలియా గెలిచేది: ఇంజ‌మామ్

ఐసీసీ  మెగా టోర్నీల్లో భారత జట్టు సెమీస్ లేదా ఫైనల్ చేరడం.. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ఏడవటం సదా మామూలే. టీమిండియా సక్సెస్‌ని ఓర్వలేక దాయాది జట్టు మాజీ ఆటగాళ్లు.. మనవారిపై ఎల్లప్పుడూ  నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఆ పరంపరను ప్రస్తుతం జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌లో మరోసారి కొనసాగించారు. దిగ్గజ క్రికెటర్‌గా పేరొందిన ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజ‌మామ్ ఉల్ హక్.. భారత పేసర్ అర్షదీప్ సింగ్‌పై సంచలన  ఆరోపణలు చేశాడు. 

ఎలా సాధ్యమైంది..! 

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో అర్షదీప్ బాల్ ట్యాంప‌రింగ్ లు పాల్పడ్డాడని ఇంజ‌మామ్ ఆరోపించాడు. 206 పరుగుల భారీ ఛేదనలో ఆస్ట్రేలియా లక్ష్యం దిశగా సాగుతున్న సమయంలో.. ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్‌లో అర్షదీప్ రివ‌ర్స్ స్వింగ్ బౌలింగ్ చేశాడ‌ని, అదెలా సాధ్యమైంద‌ని పాక్ మాజీ కెప్టెన్ ప్రశ్నించాడు. ఇందులో కుట్రకోణం ఉందని ఆరోపించాడు. ఒకవేళ బంతి రివ‌ర్స్ స్వింగ్ అయ్యే అవకాశాలు ఉంటే 12 లేదా 13వ ఓవ‌ర్‌లో ఆ జాడలు కనిపించేవని అన్నాడు. అంపైర్లు త‌మ క‌ళ్లు తెరిచి బౌల‌ర్లపై దృష్టి సారించాలని ఒక షోలో వ్యాఖ్యానించాడు.

భయపెట్టిన హెడ్

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 205 పరుగుల భారీ స్కోర్ చేయగా.. లక్ష్య ఛేదనలో కంగారూలు 184 పరుగులు చేశారు. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(76; 43 బంతుల్లో 9 ఫోర్లు, 4  సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ భారత బౌలర్లను భయపెట్టాడు. చివరకు 17వ ఓవర్‪లో బుమ్రా.. అతన్ని ఔట్ చేసి భారత జట్టుకు ఉపశమనం కలిగించాడు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ అద్భుత ప్రద‌ర్శన కనపరిచాడు. 37 పరుగులుచ్చి3 కీలక వికెట్లు పడగొట్టాడు. 

కాగా, వరుస విజయాలతో రోహిత్ సేన సెమీస్ చేరగా.. పాకిస్తాన్ చెత్త ఆట తీరుతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న అమెరికా చేతిలోనూ పాక్ ఓటమి పాలైంది.