క్రికెట్ వరల్డ్ కప్ నడుస్తోంది.. మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి.. ఇదే టైంలో.. మ్యాచులకు ధీటుగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో సంచలనాలు నమోదవుతున్నాయి. వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో దారుణమైన ఆట తీరును ప్రదర్శిస్తున్న పాక్ జట్టుపై.. ఆ దేశంలో విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాతో మ్యాచ్ ఓడిపోవటంతో మరింత కసిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు.. పాక్ క్రికెట్ బోర్డు తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు., పనికిమాలిన జట్టును ఎంపిక చేశారంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. వారం రోజులుగా పాక్ క్రికెట్ బోర్డుపై వస్తున్న వ్యతిరేకతను కూల్ చేసేందుకు.. పాక్ క్రికెట్ బోర్డు అత్యవసరంగా సమావేశం అయ్యింది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ పై వేటు వేసింది. ఇంజిమాం ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ అట్టర్ ఫ్లాప్ షో చేసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ కోసం హైదరాబాద్ లో దిగిన ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి మంచి ఊపు మీదే కనిపించింది. కానీ అనూహ్యంగా ఆ జట్టు పెద్ద జట్లపై కుప్పకూలింది. నెదర్లాండ్స్, శ్రీలంకపై తొలి రెండు మ్యాచ్ ల్లో గెలిచిన బాబర్ సేన ఆ తర్వాత వరుసగా ఇండియా,ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లపై ఓడింది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనే కాదు ఫీల్డింగ్ విషయంలో పాక్ జట్టు పేలవ ఆటతీరును ప్రదర్శించింది. దీంతో ఆ జట్టుపై ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తుంది. ఆ దేశ మాజీలు సైతం పాక్ జట్టు ఆట తీరుపై మండిపడుతున్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం కూడా సరిగా లేనట్టు తెలుస్తుంది. ఈ కారణాలతోనే పాక్ చెఫ్ సెలక్టర్ ఇంజమామ్ తన పదవికి రాజీనామా చేసాడనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. వరల్డ్ కప్ లో దాదాపుగా సెమీస్ అవకాశాలను కోల్పోయిన పాక్.. ఈ టోర్నీ అనంతరం బాబర్ అజామ్ ని కెప్టెన్ నుండి తొలగిస్తారనే ప్రచారం జరుగుతుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB),సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించి ఆటగాళ్ల మధ్య విబేధాలు ఉన్నట్లుగా సమాచారం. మరి వరల్డ్ కప్ ముగిసేసరికి పాక్ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.