Vinesh Phogat: బలంగా నిరసన తెలిపాం..: వినేశ్‌ ఫోగాట్‌ అనర్హతపై కేంద్ర క్రీడా మంత్రి

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఫోగాట్‌ 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో పోటీ పడగా.. ఆమె అంతకంటే 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా అనర్హత వేటు వేశారు. ఈ అంశంపై క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. 

ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించిన కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవియా.. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఐఓఏ చీఫ్ పీటీ ఉషను ప్రధాని మోదీ ఆదేశించారని మంత్రి తెలిపారు. యుడబ్ల్యుడబ్ల్యు (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్) యొక్క నియమ నిబంధనల ప్రకారం, అన్ని పోటీలకు, సంబంధిత వర్గానికి ప్రతి ఉదయం బరువులు నిర్వహించబడతాయని చెప్పారు.

"వినేష్ ఫోగట్ 50 కిలోల విభాగంలో పోటీపడింది. ఆమె బరువు 50 కిలోలు 100 గ్రాములు ఉండటంతో అనర్హత వేటు పడింది. ఈ వ్యవహారంపై యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్ సమాఖ్యకు భారత ఒలింపిక్ సంఘం(IOA ) నిరసన తెలిపింది. IOA అధ్యక్షురాలు PT ఉష ప్రస్తుతం పారిస్‌లో ఉన్నారు. ప్రధాని ఆమెతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అద్భుత ప్రదర్శనతో వినేశ్ ఫోగట్ ఫైనల్ చేరారు.." అని భారత క్రీడా మంత్రి పార్లమెంటులో అన్నారు.

కాగా, ఫోగట్ అంశంపై ప్రతిపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.