- ఒలింపిక్ కమిటీకి కేంద్ర సర్కారు లేఖ
- 2025లో ఐఓసీ అధ్యక్ష ఎన్నికల తర్వాత నిర్ణయం
- రేసులో ఇతర దేశాలు కూడా..
- చర్చలు ప్రారంభించిన ఐవోసీ
- ఇండియా వైపు మొగ్గు చూపే అవకాశం!
ఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడలకు భారత్ సిద్ధమైంది. 2036లో సమ్మర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తామని తెలుపుతూ ఇంటర్నేషనల్ ఒలిపిక్స్ కమిటీకి భారత ఒలింపిక్స్ అసోసియేషన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపింది. ఒక వేళ ఈ అవకాశం లభిస్తే భారత్‌లో యువత సాధికారత, ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి పెంపొందుంతుందని సర్కారు భావిస్తోంది. పలు సందర్భాల్లో ఈ క్రీడల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు.
స్వాతంత్య్ర వేడుకల్లో పారిస్ ఒలింపిక్స్ అథ్లెట్లతో జరిగిన సంభాషణల్లో 2036 ఒలింపిక్స్ నిర్వహణపై మాట్లాడారు. భారతదేశం 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోందని మోడీ చెప్పారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలనూ చేస్తామని కూడా అన్నారు. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గమంటూ క్లారిటీ ఇచ్చారు. ఇది 140 కోట్ల భారతీయుల కల అని, 2029 యూత్ ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా 2028 ఒలింపిక్స్ కోసం లాస్ ఏంజిల్స్, 2032 కోసం బ్రిస్బేన్ నగరాలు ద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి చూపు 2036 ఒలింపిక్స్ పై పడింది. వచ్చే డాది జరిగే ఇంటర్నేషనల్ ఒలిపిక్స్ కమిటీ ఎన్నికల తర్వాత 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశం విషయంలో నిర్ణయ తీసుకునే అవకాశం ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చే లెటర్లను పరిశీలించి అవకాశం ఇస్తుందని సమాచారం. స్పాన్సర్లు, ప్రసార హక్కులు, ప్రభుత్వ మద్దతు, ప్రజాఆదరణ.. ఇలా ఏ రకంగా చూసుకున్నా భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడం వల్ల ఐఓసీకి లాభమే అవుతుందని క్రీడారంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఓసీ కూడా భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.