Vinesh Phogat: వినేష్ ఫోగాట్ అనర్హత పిటీషన్.. CAS తీర్పు శాసనమన్న IOC చీఫ్

Vinesh Phogat: వినేష్ ఫోగాట్ అనర్హత పిటీషన్.. CAS తీర్పు శాసనమన్న IOC చీఫ్

తనపై పడిన అనర్హత వేటును సవాల్ చేస్తూ వినేశ్‌ ఫోగాట్.. కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (Court of Arbitration for Sports‌) ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనను ఉమ్మడి రజత(సిల్వర్) పతక విజేతగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరింది. శుక్రవారం(ఆగస్టు 9) ఈ అప్పీల్‌ను విచారించిన కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (CAS).. పారిస్ ఒలింపిక్స్ ముగిసేలోపు నిర్ణయం వెలువడుతుందని తెలిపింది. జరుగుతున్న ఈ పరిణామాలపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (IOC) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ స్పందించారు. 

వినేశ్‌ ఫొగాట్‌ పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేసిన ఆయన.. అంతర్జాతీయ సమాఖ్య నిబంధనలను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక కేటగిరీలో రెండు రజత పతకాలు ఇవ్వడం సాధ్యం కాదని నొక్కిచెప్పారు. అయితే, చివరగా ప్రస్తుతం ఈ సమస్య CAS వద్దకు చేరిందని, వారిచ్చే తీర్పును తాము అనుసరిస్తామని తెలిపారు. 

"రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ పరిస్థితిని అర్థం చేసుకోగలను. అది పూర్తిగా మానవతా కోణానికి సంబంధించింది. ఇప్పుడు ఈ సమస్య CAS పరిధిలో ఉంది. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వారిచ్చే తీర్పును అనుసరిస్తాము" అని బాచ్ విలేకరుల సమావేశంలో అన్నారు. అంటే, CAS మధ్యవర్తిగా వ్యహరిస్తున్న ఆస్ట్రేలియా డాక్టర్ అన్నాబెల్లె బెన్నెట్.. భారత గ్రాప్లర్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే, IOC ఆమెకు రజతం ప్రదానం చేయనుంది.

హరీష్ సాల్వే, సింఘానియా

అంతకుముందు కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (CAS) ఎదుట వినేశ్‌ ఫోగాట్‌ తరుపున ఫ్రాన్స్‌ న్యాయవాదులు, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తరపున హరీశ్‌ సాల్వే, విధుష్పత్‌ సింఘానియా గంటపాటు తమ వాదనలు వినిపించారు. శరీరం సహజంగా కోలుకునే ప్రక్రియ వల్లనే మంగళవారం సాయంత్రం బరువు పెరిగిందని, శరీరాన్ని చూసుకోవడం అథ్లెట్ ప్రాథమిక హక్కు అని వారు వాదించారు. పోటీలు ప్రారంభమైన మొదటి రోజు ఆమె శరీర బరువు నిర్దేశించబడిన పరిమితిలో ఉందని వారు వాదించారు. బరువు పెరగడం అనేది కేవలం కోలుకోవడం వల్ల మాత్రమే జరిగిందని, అది మోసం కాదని CAS దృష్టికి వారు తీసుకెళ్లారు.