న్యూఢిల్లీ: ఐఫోన్ మేకర్ యాపిల్ రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదు రెట్లు.. అంటే 40 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3.32 లక్షలు కోట్లు) వరకు పెంచాలని నిర్ణయించింది.గత ఆర్థిక సంవ త్సరంలో కంపెనీ 7 బిలియన్ డాలర్ల ఉత్పత్తి మార్కును దాటిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఉత్పత్తి పెంపుదలలో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఎయిర్‌పాడ్‌ల తయారీని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తున్నది. అయితే, భారతదేశంలో ఐప్యాడ్‌లు లేదా ల్యాప్‌టాప్‌లను తయారు చేసే ఉద్దేశం అయితే యాపిల్‌కు లేదని అధికారి తెలిపారు.
2022 సెప్టెంబర్ 25 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 191 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను, 38.36 బిలియన్ డాలర్ల విలువైన ఇతర ఉత్పత్తులను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో, సంస్థ 156.77 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు సాధించింది. ఐఫోన్15, ఐఫోన్15 ప్లస్ మోడల్స్‌ను భారతదేశంలోనూ తయారు చేస్తున్నామని కంపెనీ ప్రకటించింది.
ఆప్ట్రాన్సిక్స్లో ఐఫోన్ 15
యాపిల్ ప్రీమియం పార్ట్ నర్, లోకల్ యాపిల్ ఎక్స్పర్ట్ ఆప్ట్రానిక్స్.. ఐ ఫోన్ 15 అమ్మకాలను మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా 56 ఆప్ట్రానిక్స్ స్టోర్స్ లో ఇవి అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ కార్డుతో కొంటే రూ.ఐదు వేల డిస్కౌంట్ ఇస్తోంది. పాత ఫోన్లను ఆప్ట్రానిక్స్ స్టోర్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ 9, యాపిల్ వాచ్ ఆల్ట్రా 2ను కూడా తమ స్టోర్ల ద్వారా అందుబాటులోకి వచ్చాయని ఆప్ ట్రానిక్స్ తెలిపింది.