లీడర్లకు సవాల్..మార్చి22 నుంచి ఐపీఎల్17

లీడర్లకు సవాల్..మార్చి22 నుంచి ఐపీఎల్17

వెలుగు స్పోర్ట్స్​ డెస్క్​ : క్రికెట్ ఫ్యాన్స్‌‌కు మస్తు కిక్‌‌ ఇచ్చే లీగ్ ఐపీఎల్. ఈ టోర్నీలో మ్యాచ్‌‌ ఎంత రసవత్తరంగా సాగితే చూసే వాళ్లకు అంత మజా వస్తుంది. కానీ, గ్రౌండ్‌‌లో ఆడేవాళ్లకు మాత్రం సవాల్‌‌ విసురుతుంది. మరీ ముఖ్యంగా కెప్టెన్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకొని టీమ్‌‌ను సమర్థవంతంగా నడిపించిన వారికి విజయంతో పాటు పేరు లభిస్తుంది. శుక్రవారం మొదలయ్యే  ఐపీఎల్‌17వ సీజన్‌‌లో మూడు టీమ్స్‌‌ తమ కెప్టెన్లను మార్చుకున్నాయి.  ముంబై ఇండియన్స్‌‌ తమ సక్సెస్‌‌ఫుల్ లీడర్‌‌‌‌ రోహిత్ శర్మ ప్లేస్‌‌లో  హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చి విమర్శలకు గురైంది.

వరుసగా మూడో ఏడాది సన్ రైజర్స్‌‌ తమ కెప్టెన్‌‌ను మారుస్తూ మార్‌‌‌‌క్రమ్ స్థానంలో ఆస్ట్రేలియన్ కమిన్స్‌‌కు పగ్గాలు అప్పగించింది. పాండ్యాను వదులుకున్న గుజరాత్‌‌ యంగ్‌‌స్టర్ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌కు కెప్టెన్సీ ఇచ్చింది. విమర్శల మధ్య ముంబై కెప్టెన్సీ పాండ్యాకు  సవాల్ విసురుతుండగా, కొత్తగా కెప్టెన్సీ బాధ్యత  కమిన్స్‌‌, గిల్‌‌కు చాలెంజ్ కానుంది. 

పాండ్యాపై ప్రెజర్‌‌‌‌

ఆల్‌‌రౌండర్‌‌‌‌గా మంచి పేరుతెచ్చుకున్న హార్దిక్ పాండ్యా 2022లో కొత్త టీమ్ గుజరాత్‌‌ టైటాన్స్‌‌కు కెప్టెన్సీ చేపట్టి తనలోని నాయకుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. తొలి సీజన్‌‌లోనే టైటాన్స్‌‌కు ట్రోఫీ అందించిన పాండ్యా 2023లోనూ జట్టును ఫైనల్‌‌కు తీసుకెళ్లాడు. కానీ, అనూహ్య పరిణామాల మధ్య  ఈ సీజన్‌‌లో అతను గుజరాత్ టైటాన్స్‌‌ను వదిలేసి ముంబై ఇండియన్స్‌‌ జట్టులోకి తిరిగొచ్చాడు. ట్రేడింగ్‌లో పాండ్యాను తీసుకున్న ముంబై ఫ్రాంచైజీ తమ సక్సెస్‌‌ఫుల్ లీడర్ రోహిత్ శర్మ స్థానంలో అతనికి కెప్టెన్సీ అప్పగిస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అభిమానులే కాదు ఆటగాళ్లు సైతం ఈ నిర్ణయంతో షాక్ అయ్యారు.  

హార్దిక్ ట్రేడ్,  కెప్టెన్సీ మార్పు గురించి తెలుసుకున్న  ముంబై సీనియర్ ప్లేయర్లు సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్టులు పెట్టారు. ముంబైకి రికార్డు స్థాయిలో ఐదు టైటిళ్లు అందించిన రోహిత్‌‌ జట్టులో చాలా మంది యంగ్‌‌స్టర్స్‌‌ను తీర్చిదిద్దాడు. పాండ్యా కూడా అతని నీడలో ఎదిగినవాడే. అలాంటి రోహిత్ స్థానంలో పాండ్యాకు పగ్గాలు ఇవ్వడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు కెప్టెన్సీ మార్పునకు కారణం ఏమిటన్న మీడియా ప్రశ్నకు పాండ్యా సమాధానం చెప్పలేక బిక్కమొహం వేసుకున్నారు. రోహిత్‌‌ సక్సెస్‌‌ను కొనసాగించడమే తన ముందున్న కర్తవ్యమని చెప్పాడు. కానీ, అది అంత సులభం కాబోదు.  

పదేండ్ల తర్వాత నాయకత్వ మార్పును ముంబై ఆటగాళ్లు ఎలా స్వీకరిస్తారో చూడాలి. పాండ్యాకు కెప్టెన్సీ కొత్త కాకపోయినా ఇప్పుడు రోహిత్‌‌తో పాటు బుమ్రా, సూర్యకుమార్‌‌‌‌ వంటి సీనియర్లతో  ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాడన్నది కీలకం కానుంది. గత సీజన్‌‌లో ముంబై నిరాశ పరిచినప్పటికీ ఈసారి ఏమాత్రం తేడా జరిగినా పాండ్యాపై విమర్శల దాడి పెరగొచ్చు. దాంతో మైదానం లోపల, బయట పాండ్యాపై ప్రెజర్ ఉండనుంది. 

కమిన్స్‌‌కు పరీక్ష 

వేలంలో తన ధరతో రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ పాట్ కమిన్స్‌‌పై ఈ ఐపీఎల్‌‌లో అందరి ఫోకస్ ఉండనుంది. ఆస్ట్రేలియాకు ఐసీసీ టెస్టు చాంపియన్‌‌షిప్‌‌, వన్డే వరల్డ్ కప్‌‌ అందించిన కమిన్స్‌‌ను సన్‌‌రైజర్స్ వేలంలో రూ. 20.5 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. అతనికే కెప్టెన్సీ అప్పగించింది. గత మూడు సీజన్లలో  చెత్తగా ఆడుతున్న  సన్‌‌రైజర్స్‌‌ కెప్టెన్సీ, కోచ్‌‌ల మార్పు సర్కస్‌‌ను తలపిస్తోంది. వార్నర్‌‌‌‌ను కాదని విలియమ్సన్‌‌ను, అతని ప్లేస్‌‌లో గత సీజన్‌‌లో ఐడెన్‌‌ మార్‌‌‌‌క్రమ్‌‌ను కెప్టెన్‌‌గా నియమించిన రైజర్స్ కమిన్స్‌‌కు పగ్గాలు ఇచ్చింది.

ఆసీస్‌‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కమిన్స్ రాకతో అయినా తమ రాత మారాలని కోరుకుంటోంది. కానీ, షార్ట్ ఫార్మాట్‌‌లో కమిన్స్‌‌కు కెప్టెన్సీ అనుభవం అంతగా లేదు. ఐపీఎల్‌‌లో అతను తొలిసారి కెప్టెన్సీ చేపడుతున్నాడు. పైగా యాషెస్‌‌, వరల్డ్ కప్‌‌పై ఫోకస్ పెట్టేందుకు అతను గత సీజన్‌‌కు దూరంగా ఉన్నాడు. వాస్తవానికి ఐపీఎల్‌‌లో ప్లేయర్‌‌‌‌గానూ అతని రికార్డు గొప్పగా లేదు. 42 మ్యాచ్‌‌ల్లో 8.54 ఎకానమీతో 45 వికెట్లు మాత్రమే తీశాడు.  మరి, చాలా ఒత్తిడి ఉండే, క్షణాల్లో ఆట స్వరూపం మారిపోయే ఐపీఎల్‌‌లో కెప్టెన్‌‌గా రైజర్స్‌‌ను కమిన్స్ ఎలా నడిపిస్తాడో చూడాలి.

వర్క్‌‌లోడ్‌‌ కారణంగా టీ20లను పరిమితంగా ఆడుతున్న కమిన్స్‌‌ ఇప్పుడు లీడర్‌‌‌‌గా తను ఇప్పుడు ఉమ్రాన్‌‌ వంటి యంగ్‌‌స్టర్స్‌‌కు మార్గనిర్దేశం చేసే సమయం కేటాయిస్తాడా? అన్నది చూడాలి. అలాగే మయాంక్‌‌ అగర్వాల్, భువనేశ్వర్ వంటి ఇండియా సీనియర్లను సమన్వయం చేసుకోవాలి. కమిన్స్‌‌తో పాటు మార్కో జాన్సెన్‌‌, మార్‌‌‌‌క్రమ్‌‌, హసరంగ, గ్లెన్ ఫిలిప్స్‌‌, క్లాసెన్, ట్రావెస్ హెడ్‌‌ రూపంలో సన్‌‌ రైజర్స్‌‌కు ఫారిన్ స్టార్స్‌‌ అందుబాటులో ఉన్నారు. కానీ, తుది జట్టులో నలుగురు ఫారినర్స్‌‌నే ఎంచుకోవడం కమిన్స్‌‌కు కత్తిమీద సాము కానుంది. 

గిల్‌‌కు కొత్త

ఈ ఐపీఎల్‌‌లో యంగెస్ట్ కెప్టెన్‌‌గా శుభ్‌‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్‌‌ను నడిపించనున్నాడు. హార్దిక్ పాండ్యాను ముంబైకి ట్రేడ్ చేసిన గుజరాత్ అతని స్థానంలో 24 ఏండ్ల గిల్‌‌కు పగ్గాలు అప్పగించింది. సూపర్‌‌‌‌ టాలెంటెడ్ అయిన గిల్  తక్కువ కాలంలో సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌గా ఎదిగాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్ నుంచి అదరగొడుతున్న అతను 2018 అండర్‌‌‌‌19 వరల్డ్ కప్‌‌తో వెలుగులోకి వచ్చాడు. వెంటనే  టీమిండియాలోకి వచ్చిన అతను అన్ని ఫార్మాట్లలోనూ టీమ్‌‌లో కీలక ప్లేయర్‌‌‌‌గా మారాడు. ముఖ్యంగా గతేడాది అతని కెరీర్‌‌‌‌ పీక్‌‌ స్టేజ్‌‌కు వెళ్లింది.

గత ఐపీఎల్‌‌లో 890 రన్స్‌‌తో టాప్‌‌ స్కోరర్‌‌‌‌గా నిలిచిన గిల్ టీమిండియా తరఫున 52 ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌ల్లో ఏడు సెంచరీలు, 10 ఫిఫ్టీలతో 2154 రన్స్‌‌తో అదరగొట్టాడు. దాంతో పాండ్యా వెళ్లిపోగానే టైటాన్స్ మరో ఆలోచనే లేకుండా గిల్‌‌కు కెప్టెన్సీ ఇచ్చింది. ఫ్యూచర్‌‌‌‌ను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, డ్యాషింగ్ ఓపెనర్‌‌‌‌గా పేరొందిన గిల్‌‌కు కెప్టెన్సీ కొత్త. దాంతో ఈ సవాల్‌‌ను అతను ఎలా స్వీకరిస్తాడన్నది ఆసక్తిగా మారింది. గుజరాత్ గత రెండు సీజన్లలో ఫైనల్ చేరిన నేపథ్యంలో ఆ సక్సెస్‌‌ను కొనసాగించే బాధ్యత అతనిపై ఉండనుంది.

ఈ నేపథ్యంలో తను ముందుగా మిల్లర్, రషీద్ ఖాన్, సాహా వంటి సీనియర్లు తన కెప్టెన్సీలో సౌకర్యవంతంగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే, పాండ్యా స్థానాన్ని, గాయపడి ఈ సీజన్‌‌కు దూరమైన షమీ స్థానాన్ని సరైన ప్లేయర్లతో భర్తీ చేయాలి. బ్యాటర్‌‌‌‌గా గత సీజన్‌‌ ఫామ్‌‌ను కొనసాగిస్తే మంచిది. లీడర్‌‌‌‌గా వ్యూహాలు రచించేందుకు ఆశీష్ నెహ్రా రూపంలో అనుక్షణం వెన్నంటి ఉండే కోచ్‌‌ అతనికి సపోర్ట్‌‌ ఇవ్వనున్నాడు.