
- తొలి మ్యాచ్‌లో బెంగళూరుతో కోల్‌కతా ఢీ
- మ్యాచ్‌కు వర్షం ముప్పు!
- రా. 6.00 నుంచి ఓపెనింగ్ సెర్మనీ
- స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో
ఏడు ఫ్రాంచైజీలకు కొత్త కెప్టెన్లు.. మరికొన్ని కొత్త రూల్స్.. బాల్‌పై లాలాజలం వాడటానికి అనుమతి.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కొత్త బాల్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు.. కొనసాగనున్న ఇంపాక్ట్ రూల్‌తో.. ఐపీఎల్–18కు రంగం సిద్ధమైంది. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ధనాధన్ హంగామాకు తెరలేవనుంది.
చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన చెన్నై, ముంబైతో పాటు ఇతర జట్లు కూడా ఈసారి తమ సత్తా చూపేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఓవరాల్‌గా 10 జట్లు.. 65 రోజులు.. 74 మ్యాచ్‌లతో.. 13 నగరాలకు మినీ క్రికెట్ పండగ రాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రికెట్ ఫ్యాన్స్‌ను కనువిందు చేసేందుకు స్వదేశీ,విదేశీ స్టార్లు కూడా రెడీ అయ్యారు.
కోల్‌కతా:
యావత్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమ్మర్ కార్నివాల్.. ఐపీఎల్–18కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి రెండు నెలల పాటు క్రికెట్ ప్రపంచాన్ని తమ బ్యాట్, బాల్స్‌తో ఉర్రూతలూగించేందుకు స్టార్లందరూ రెడీ అయ్యారు. మ్యాచ్‌లు జరిగే అన్ని నగరాల్లో టిక్కెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోగా, ఈసారి లీగ్‌ను మరింత రసవత్తరంగా నిర్వహించేందుకు బీసీసీఐ కూడా కొన్ని కీలక చర్యలు చేపట్టింది. కొవిడ్ తర్వాత బంతిపై ఉమ్మి రుద్దడాన్ని ఐసీసీ ఆపేయగా, ఈసారి లీగ్‌లో దీనికి అనుమతించారు.
దీంతో బౌలర్లకు ఇది ఓ రకంగా పండుగే అని చెప్పొచ్చు. రాత్రి వేళలో జరిగే మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో కొత్త బాల్‌ను వాడేందుకు కూడా అనుమతించారు. అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌ల ట్రెండ్ కొనసాగే అవకాశం ఉన్నందున దాని ప్రభావం బౌలర్లపై పడొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హై వేడ్స్, ఆఫ్ సైడ్ వైడ్స్‌ను మరింత కరెక్ట్‌గా నిర్ధారించేందుకు డెసిషన్ రివ్యూ సిస్టమ్‌ను విస్తరించారు. బాల్స్ డెలివరీల నాణ్యతను దీని ద్వారా కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమల్లో ఉన్నందున ప్రతి జట్టులో ఓ కొత్త హీరో అవతరించనున్నాడు.
బుమ్రా ఫిట్‌నెస్..
ఆరో టైటిల్ వేటలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు బుమ్రా ఫిట్‌నెస్ ఆందోళనకరంగా మారింది. వెన్ను నొప్పి నుంచి కోలుకుంటున్న అతను ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉన్నాడు. అయితే అతను బరిలోకి దిగే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఐపీఎల్ తర్వాత టీమిండియా కీలకమైన ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి బుమ్రాను కాపాడుకోవడం అత్యంత కీలకం. లెజెండ్ ఎం.ఎస్. ధోనీకి ఇది చివరి సీజన్ అని ఊహాగానాలు వస్తున్నాయి.
గతంలో మాదిరిగా స్థిరమైన మ్యాచ్ విన్నర్ కాకపోయినా సీఎస్కేకు అతను ఉండటం కొండంత బలం. రుతురాజ్‌ను ఈసారి టైటిల్ దిశగా నడిపించే బాధ్యత కూడా ధోనీపైనే ఉంది. టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత రోహిత్, విరాట్ ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. దీంతో ఈ లీగ్‌లో వీళ్ల మెరుపుల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు.
కెప్టెన్ కార్నర్..
ఈసారి లీగ్‌లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏడు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. ఇక అన్నింటికంటే ఆశ్చర్యకరమైంది రజత్ పటిదార్ కెప్టెన్సీ. టీమిండియా తరఫున ఒక్క టీ20 కూడా ఆడకుండానే మెగా స్టార్ కోహ్లీ ఉన్న టీమ్‌కు నాయకత్వం వహించడం. స్టార్లను కాదని అక్షర్ పటేల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అప్పగించడం. గతేడాది కేకేఆర్‌ను నడిపించిన శ్రేయస్ అయ్యర్ ప్లేస్‌లో అనూహ్యంగా అజింక్యా రహానే జట్టు పగ్గాలు చేపట్టాడు.
సంజూ శాంసన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో రాజస్తాన్ ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హార్దిక్ పాండ్యాపై సస్పెన్షన్ వేటు ఉండటంతో ముంబై ఆడే తొలి మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు. లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా రిషబ్ పంత్ (రూ. 27 కోట్లు).. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. మెగా లీగ్‌లో రాణిస్తే టీమిండియా టీ20 ఫార్మాట్‌లో రెగ్యులర్ ప్లేయర్‌గా మారతాడు. కాబట్టి పంత్ నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది.
ఆర్‌సీబీ ఈసారైనా..
ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, బెంగళూరుతో లీగ్‌కు తెరలేవనుంది. 17 ఏళ్ల కిందట తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే బ్రెండన్ మెకల్లమ్ 158 రన్స్‌తో ఒక్కసారిగా టీ20లకు ఊపు తెచ్చాడు. అప్పట్నించి అదే వారసత్వాన్ని కొనసాగించిన కేకేఆర్ ఇప్పటికి మూడుసార్లు టైటిల్స్ నెగ్గింది. కొత్త కెప్టెన్ రహానే నాయకత్వంలోనూ దీన్ని కొనసాగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ విన్నర్ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌పై అందరి దృష్టి నెలకొంది.
ఇక చాలా ఏళ్ల నుంచి టైటిల్‌కు అడుగు దూరంలో నిలుస్తున్న ఆర్‌సీబీ ఈసారి ఆ కలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. కోహ్లీ, సాల్ట్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మతో కూడిన బలమైన బ్యాటింగ్ ఉండటం కలిసొచ్చే అంశం. కాకపోతే బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తున్నది. భువనేశ్వర్, హాజిల్‌వుడ్‌పైనే ఎక్కువ భారం పడనుంది.
ఆటకు ముందు ఆటాపాట
ఆటకు ముందు ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచేందుకు గ్రాండ్‌గా ఓపెనింగ్ సెర్మనీని నిర్వహిస్తారు. ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో బాలీవుడ్ స్టార్ దిశా పటానీ తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించనుంది. ప్రఖ్యాత సింగర్ శ్రేయా ఘోషల్ తన మధురమైన పాటలతో అలరించనుంది. వీళ్లకు తోడుగా పంజాబీ సెన్సేషనల్ కరణ్ ఔజ్జా చార్ట్ టాపింగ్ బీట్స్‌తో మంత్రముగ్దులను చేయనున్నాడు. శ్రద్ధా కపూర్, వరుణ్ ధవన్ డ్యాన్స్‌లతో పాటు చివర్లో అమెరికన్ పాప్ బ్రాండ్ వన్ రిపబ్లిక్ తన మ్యూజిక్ షోతో ఈవెంట్‌ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లనుంది.
ఈసారి ఐపీఎల్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. మ్యాచ్‌లకు వేదికలైన 13 నగరాల్లోనూ ఓపెనింగ్ సెర్మనీలను నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఆయా వేదికల్లో బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, వికీ కౌశల్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, మాధురి దీక్షిత్, జాహ్నవి కపూర్‌తో పాటు స్థానిక కళాకారులు, లోకల్ బ్రాండ్స్ ఆటపాట ఉండనున్నాయి.