నేడు ఐపీఎల్‌ ఫైనల్‌

నేడు ఐపీఎల్‌ ఫైనల్‌

ఓవైపు మెగా లీగ్‌‌లోకి కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్‌‌ టైటాన్స్‌‌.. మరోవైపు ఓసారి టైటిల్‌‌ గెలిచిన రాజస్తాన్‌‌ రాయల్స్‌‌..! ఒకరిదేమో ఆల్‌‌రౌండర్ల బలం.. మరొకరిదేమో పోరాటస్ఫూర్తి..! రెండు నెలల కిందట ఏమాత్రం అంచనాలు లేకుండా..  ఫేవరెట్‌‌ హోదాకు దూరంగా..  సరికొత్త ఆటతో.. సంచలన విజయాలు నమోదు చేసిన ఈ రెండు జట్లు.. ఐపీఎల్‌‌ మెగా టైటిల్‌‌ ఫైట్‌‌కు రెడీ అయ్యాయి..! పవర్‌‌ హిట్టర్లతో.. పదునెక్కిన బౌలర్లతో జీటీ కాస్త బలంగా కనిపిస్తున్నా.. తనదైన రోజున విశ్వరూపం చూపే బట్లర్‌‌ అండతో రాయల్స్‌‌ కూడా రెండో టైటిల్‌‌ను లక్ష్యంగా పెట్టుకుంది..! మొత్తానికి మెగా లీగ్‌‌కు అదిరిపోయే ముగింపు ఇచ్చేందుకు రెడీ అయిన పాండ్యాసేన.. శాంసన్‌‌ బృందానికి మూడోసారి షాకిచ్చి కొత్త చాంపియన్‌‌గా అవతరిస్తుందా? లేక పాత చాంపియన్‌‌కే టైటిల్‌‌ను అప్పగిస్తుందా? చూడాలి..!

అహ్మదాబాద్‌‌‌‌‌‌ :  ఉత్కంఠ రేపిన మ్యాచ్‌‌‌‌లతో.. ఫేవరెట్లకు దిమ్మతిరిగే షాక్‌‌‌‌లతో..  ఫ్యాన్స్‌‌‌‌ను అలరించిన ఐపీఎల్‌‌‌‌–15 ఆఖరి మెట్టుకు చేరుకుంది. ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్‌‌‌‌, రాజస్తాన్‌‌‌‌ మధ్య హై ఓల్టేజ్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు రంగం సిద్ధమైంది. అరంగేట్రం లీగ్‌‌‌‌లోనే ఫైనల్‌‌‌‌కు చేరి కొత్త చరిత్ర సృష్టించిన జీటీ.. టైటిల్‌‌‌‌నూ గెలవాలని పక్కా లెక్కలతో బరిలోకి దిగుతున్నది. ఇక ఆసీస్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ షేన్‌‌‌‌ వార్న్‌‌‌‌ నేతృత్వంలో 2008లో టైటిల్‌‌‌‌ గెలిచిన రాయల్స్‌‌‌‌.. 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ట్రోఫీ కలను నెరవేర్చుకోవాలని భావిస్తోంది. అప్పుడు కూడా ఏమాత్రం అంచనాల్లేకుండా లీగ్‌‌‌‌లోకి వచ్చి ఏకంగా టైటిల్‌‌‌‌ను ఎగురేసుకుపోయింది. కాబట్టి మరోసారి అదే ఫీట్‌‌‌‌ను పునరావృతం చేయాలని రాయల్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. క్వాలిఫయర్‌‌‌‌–1లో రాజస్తాన్‌‌‌‌పై గెలవడం జీటీకి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. ఓవరాల్‌‌‌‌గా రెండు జట్లు కొత్త చరిత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో చాంపియన్‌‌‌‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 

మిల్లర్‌‌‌‌ 2.0 :
నాలుగు రోజులు విశ్రాంతి రావడం, అనుకున్న ప్లేయర్లందరూ టాప్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటంతో జీటీ.. ఫైనల్‌‌‌‌ కోసం తుది జట్టులో పెద్దగా మార్పులు చేయడం లేదు. క్వాలిఫయర్‌‌‌‌–1లో ఆడిన జట్టునే యథావిధిగా దించే చాన్స్‌‌‌‌ ఉంది. ఐదేళ్ల కిందట అత్యుత్తమ క్రికెట్‌‌‌‌ ఆడిన డేవిడ్‌‌‌‌ మిల్లర్‌‌‌‌ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు. పాండ్యా ఇచ్చిన అండతో క్వాలిఫయర్‌‌‌‌–1 మ్యాచ్‌‌‌‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఓపెనింగ్‌‌‌‌లో సాహా, గిల్‌‌‌‌ గాడిలో పడాలి. ఇద్దరూ మంచి ఆరంభాన్నివ్వాలి. వేడ్‌‌‌‌పై కూడా భారం అధికంగానే ఉంది. ఇక బ్యాటర్‌‌‌‌గా, బౌలర్‌‌‌‌గా, కెప్టెన్‌‌‌‌గా హార్దిక్‌‌‌‌ త్రిపాత్రాభినయం ఈ సీజన్‌‌‌‌లో సూపర్‌‌‌‌ హిట్టయ్యింది. రాహుల్‌‌‌‌ తెవాటియా ఫినిషింగ్‌‌‌‌ కోసం ఫ్యాన్స్‌‌‌‌ వెయిటింగ్‌‌‌‌. రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో రాణిస్తుండటం జీటీకి అదనపు బలం. పేసర్లుగా షమీ, జోసెఫ్‌‌‌‌, యష్‌‌‌‌ దయాల్‌‌‌‌ను కొనసాగించొచ్చు. లేదంటే ల్యూకీ ఫెర్గుసన్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇస్తారో చూడాలి.  రషీద్‌‌‌‌, సాయి కిశోర్‌‌‌‌ స్పిన్‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌ కోసం రెడీగా ఉన్నారు. 

 

బట్లర్‌‌‌‌‌‌పైనే భారం :
పేపర్‌‌‌‌ మీద బలంగా కనిపిస్తున్న రాయల్స్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ మొత్తం బట్లర్‌‌‌‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కొన్నిసార్లు పాజిటివ్‌‌‌‌గా కనిపించే ఈ అంశం.. ఎక్కువసార్లు మైనస్‌‌‌‌గా మారుతున్నది. బట్లర్‌‌‌‌ ఉన్నాడనే భరోసాతో మిగతా లైనప్‌‌‌‌లో డెప్త్‌‌‌‌ పెరగడం లేదు. టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో జైస్వాల్‌‌‌‌, శాంసన్‌‌‌‌, పడిక్కల్‌‌‌‌ బ్యాట్‌‌‌‌ ఝుళిపించాల్సిన టైమ్‌‌‌‌ వచ్చేసింది. వీళ్లలో ఏ ఒక్కరైనా బట్లర్‌‌‌‌కు అండగా నిలిస్తే రాజస్తాన్‌‌‌‌ భారీ స్కోరు కష్టాలు తీరినట్లే. ఫినిషింగ్‌‌‌‌లో హెట్‌‌‌‌మయర్‌‌‌‌ మెరుపులు కనిపించడం లేదు. రియాన్‌‌‌‌ పరాగ్‌‌‌‌పై పెద్దగా ఆశలు పెట్టుకునే చాన్స్‌‌‌‌ లేదు. అశ్విన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో రాణించడం సానుకూలాంశం. బౌలింగ్‌‌‌‌లో బౌల్ట్‌‌‌‌, ప్రసీధ్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం అతిపెద్ద బలం. స్పిన్నర్లుగా చహల్‌‌‌‌, అశ్విన్‌‌‌‌కు తిరుగులేదు. ఈ ఇద్దరు మిడిల్‌‌‌‌లో  మ్యాచ్‌‌‌‌ను కాపాడటంతో పాటు స్లాగ్‌‌‌‌ ఓవర్లలో మెకే చెలరేగితే రాయల్స్‌‌‌‌కు విజయం కష్టాలు తీరినట్లే. 

శాంసన్ అసాధారణ ప్లేయర్ : సంగక్కర
అహ్మదాబాద్ : రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌‌‌‌పై ఆ జట్టు కోచ్ కుమార సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు. అతడో అసాధారణ కెప్టెన్, ప్లేయర్ అంటూ కితాబిచ్చాడు. శాంసన్‌‌కు అతడి బాధ్యతలపై పూర్తి అవగాహన ఉందన్నాడు. ‘శాంసన్ ఓ అసాధారణ ఆటగాడు. నిరుడు సీజన్‌‌లో యంగ్ ప్లేయర్లతో బయోబబుల్​లో జట్టును గొప్పగా నడిపించాడు.  అతను చాలా తక్కువగా మాట్లాడతాడు . ఎంతో నైపుణ్యం ఉన్న బ్యాటర్ కూడా. అభిరుచి గల కెప్టెన్‌‌గా విజయాలే లక్ష్యంగా ముందుకు సాగుతుంటాడు. బట్లర్ లాంటి గొప్ప ప్లేయర్  ఉన్న జట్టులో వికెట్ కీపర్‌‌గా, కెప్టెన్‌‌గా, ఉత్తమ బ్యాటర్‌‌గా పేరందుకోవడం అంత చిన్న విషయం కాదు. కానీ శాంసన్ ఈ సీజన్‌‌లో గొప్పగా రాణించాడు. తన కెప్టెన్సీ పాత్ర పట్ల శాంసన్‌‌కు పూర్తి స్పష్టత ఉంది. అతడి వ్యూహాల్లో పదును పెరిగింది. సహ ప్లేయర్లపై పూర్తి నమ్మకముంచి లీడర్‌‌గా ఎదుగుతున్నాడు’ అని సంగక్కర వెల్లడించాడు. అలాగే ఈ సీజన్‌‌లో జట్టుకు బట్లర్ చేసిన కృషిని మాటల్లో చెప్పలేమన్నాడు. 

 

అతను పాత కోహ్లీ కాదు: సెహ్వాగ్
న్యూఢిల్లీ: టీమిండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన 14 ఏళ్ల కెరీర్‌‌‌‌లో చేసిన తప్పిదాలకంటే ఈ ఒక్క ఐపీఎల్ సీజన్‌‌లోనే ఎక్కువ మిస్టేక్స్ చేశాడని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతడిలో మునుపటి కోహ్లీ కనిపించడం లేదన్నాడు. ‘మనకు తెలిసిన కోహ్లీ అతను కాదు. ఈ సీజన్‌‌లో అసలైన కోహ్లీ కనిపించనేలేదు. ఈ సీజన్‌‌లో అతడు చేసిన తప్పులు తన మొత్తం కెరీర్‌‌లో చేసుండడు. దాదాపు అన్ని రకాలుగా కోహ్లీ ఔటవుతున్నాడు. రన్స్ చేయడంలో విఫలమవుతున్నప్పుడే ఇలా జరుగుతుంది. ఫామ్‌‌లోకి రావడానికి చాలా రకాలుగా ప్రయత్నించి ఇలా ఏదో రకంగా ఔటవుతూ ఉంటారు. ఎప్పుడైతే ఫామ్‌‌లో లేమో అప్పుడు బంతిని బ్యాట్ మిడిల్‌‌లో తగిలేలా చూసుకోవాలి. అప్పుడే ఆ బ్యాటర్‌‌కు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రాజస్తాన్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో బౌల్ట్ వేసిన ఫస్ట్ ఓవర్లో కోహ్లీ చాలా బంతుల్ని వదిలేశాడు. ఇది ఫామ్‌‌లో లేనప్పుడు జరిగే సాధారణ విషయం. కొన్నిసార్లు అదృష్టంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నా ఔటయ్యే  ప్రమాదం తక్కువగా ఉంటుంది. కానీ కోహ్లీ విషయంలో అది జరగలేదు. కీలక మ్యాచ్‌‌లో  కోహ్లీ వైఫల్యం ఎంతో మంది ఫ్యాన్స్‌‌ను నిరాశకు గురిచేసింది’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఈ సీజన్‌‌లో ఆడిన16 మ్యాచ్‌‌ల్లో విరాట్ 22.73 సగటుతో 341 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం :-

ఐపీఎల్లో అర్సీబీ బౌలర్ చెత్త రికార్డు


స్టార్ ఆటగాళ్లకు షాక్...టీమ్లో నో ఛాన్స్