భారత మాజీ ఆటగాడు, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ అని స్పష్టం చేశాడు. ఈ మేరకు రాయుడు ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశాడు.
2010లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన రాయుడు.. సుదీర్ఘకాలం ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2013 సీజన్ లో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్ధాడిన రాయుడు.. 2015, 2017లో టైటిల్ గెలిచిన ముంబయి జట్టులో కీలక ఆటగాడు. ఆ తర్వాత 2018లో చెన్నై జట్టులోకి మకాం మార్చిన అతడు.. 2018, 2021లో టైటిల్ గెలిచిన సీఎస్కే జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటివరకూ 203 ఐపీఎల్ మ్యాచులాడిన రాయుడు.. 127.26 స్ట్రైక్‌రేట్‌తో 4,329 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అహ్మదాబాద్ వేదికగా చెన్నై - గుజరాత్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ తన చివరి మ్యాచ్ అని రాయుడు తెలియజేశాడు. "ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. రెండు గొప్ప జట్లు. 2014 మ్యాచులు, 14 సీజన్లు, 11 ప్లేఆఫ్స్, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు.. ఈ రాత్రి ఆరో టైటిల్ గెలుస్తామని నమ్ముతున్నా. ఇదో చక్కని ప్రయాణం. ఈ రాత్రి ఫైనల్ నా ఐపీఎల్ ప్రయాణంలో ఆఖరి మ్యాచ్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నా. ఈ గొప్ప టోర్నీలో ఆడడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశా.. థ్యాంక్యూ ఆల్.. నో యూ టర్న్..' అంటూ రాయుడు ట్వీట్ చేశాడు.