కెరీర్‌లో చివరి మ్యాచ్..  రోహిత్ రికార్డును సమం చేసిన రాయుడు

కెరీర్‌లో చివరి మ్యాచ్..   రోహిత్ రికార్డును సమం చేసిన రాయుడు

కెరీర్ చివరి మ్యాచ్‌లో అంబటి రాయుడు అరుదైన ఘనత సాధించాడు. ప్లేయర్‌గా ఆరో ఐపీఎల్ టైటిల్ అందుకున్నాడు. దీంతో లీగ్ అత్యధిక ట్రోఫీల్లో భాగమైన ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ముంబై తరఫున 2013, 15, 17 సీజన్లలో భాగమైన రాయుడు.. సీఎస్‌కే తరుపున 2018, 21, 23 ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇక రోహిత్ విషయానికొస్తే.. 2009 సీజన్‌లో విజేతగా నిలిచిన డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడిన హిట్ మ్యాన్.. ముంబై తరుపున 2013,15, 17, 19, 20 సీజన్లలో ట్రోఫీ అందుకున్నాడు. ఈ జాబితాలో ధోనీ, హార్దిక్ పాండ్యా ఐదేసి టైటిళ్లు సాధించారు.

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచే..తన చివరి మ్యాచ్ అని రాయుడు ముందుగానే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌తో తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన రాయుడు.. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు షాట్లతో అలరించాడు. 25 బంతుల్లో 55 పరుగులు కావాల్సిన సమయంలో వరుసగా 6,4,6 బాది లక్ష్యాన్ని తేలిక చేశాడు. అతడు ఔటయ్యేసరికి చెన్నై 15 బంతుల్లో 23 పరుగులు చేయాలి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి.. ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పడంతో ఇకపై మైదానంలో కనపించకపోవచ్చు.  

ఐపీఎల్‌లో 204 మ్యాచులు ఆడిన రాయుడు 4348 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. రాయుడు త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.