మే 28న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచును వీక్షించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC), అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB)ల అధ్యక్షులు స్వదేశానికి రానున్నారు. ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు ఆహ్వానాలు అందాయి. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేశారు. అదే రోజు ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహణపై కూడా స్పష్టత రానుంది.
ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహణపై సందిగ్ధత వీడడం లేదు. వాస్తవానికి ఈ టోర్నీ పాక్ వేదికగా జరగాల్సి ఉన్నా, భద్రతా కారణాల రీత్యా భారత జట్టు.. పాక్ లో పర్యటించడం కుదరదని చెప్పడంతో ఈ వివాదం మొదలయింది. అందుకు అంగీకరించని పాక్ క్రికెట్ బోర్డు(PCB), అదే జరిగితే ఈ ఏడాది చివరలో భారత్ గడ్డపై జరగబోయే వన్డే వరల్డ్ కప్ 2023లో పాల్గొనబోమని తేల్చిచెప్పింది. ఆలా మొదలైన మాటల పరంపర ఇరు దేశాల బోర్డు మధ్య ఇంకా కొనసాగుతూనే ఉంది.
కాగా, ఐపీఎల్ 2023 సీజన్‌లో మరో రెండు మ్యాచులు మాత్రమే మిగిలివున్నాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచులో విజయం సాధించిన చెన్నై ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా, మరో బెర్త్ కోసం రెండు జట్లు పోటీలో ఉన్నాయి. మే26న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే రెండో క్వాలిఫయర్ మ్యాచులో విజయం సాధించిన జట్టు చెన్నైతో అమీ తుమీ తేల్చుకోనుంది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆరంభం కానుంది.