అరుదైన రికార్డుకు అడుగు దూరంలో మహేంద్రసింగ్ ధోని

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో మహేంద్రసింగ్ ధోని

భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆదివారం(మే 28) గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే ఫైనల్ మ్యాచ్ ఆడటం ద్వారా ధోని ఐపీఎల్‌లో 250 మ్యాచులు పూర్తి చేసుకోనున్నాడు. దీంతో 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచులు ఆడిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (243), దినేశ్ కార్తీక్ (242), విరాట్ కోహ్లీ (237), రవీంద్ర జడేజా (225) ఆ తర్వాత స్థానాల్లో  ఉన్నారు.

ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో మహేంద్రసింగ్ ధోని ఒకరు.  సారథిగా చెన్నై జట్టును  9 సార్లు  ఫైనల్ చేర్చిన ధోని, నాలుగు సార్లు  ఛాంపియన్‌గా నిలిపాడు. అతని కెప్టెన్సీలోనే చెన్నై 2010, 2011, 2018, 2021 సీజన్లలో విజేతగా నిలిచింది. ఇప్పుడు పదోసారి ఫైనల్ చేరిన సీఎస్కే.. ఐదోసారి టైటిల్ పై కన్నేసింది. ఇప్పటివరకూ 249 మ్యాచులు ఆడిన ధోని.. 5,082 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం మీద 239 సిక్సులు బాదాడు.

రిటైర్మెంట్‌పై స్పష్టత.. 

ఈ మ్యాచుతో ధోని రిటైర్మెంట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై ధోనీ సహా ఎవరూ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. అతనికి ఇదే చివరి మ్యాచ్ అన్న వార్తలొస్తున్నాయి. వాస్తవానికి ధోని గతేడాదే తప్పుకోవాలనుకున్నా.. చెన్నై అభిమానులకు తన జ్ఞాపకాలు అందించడం కోసం ఈ సీజన్‌లో కొనసాగాడు. అతడు అనుకున్నట్లుగానే సీఎస్కే జట్టు ఫైనల్ చేరింది. ఈ మ్యాచులో చెన్నై గెలిస్తే.. తప్పుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం మరొకటి ఉండదని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఓడినా జట్టు ఫైనల్ చేరిందన్న అనుభూతి ఉంటుంది కనుక తప్పుకోవడం ఖాయమంటున్నారు.