ఆదివారం అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురవడంతో చెన్నై, గుజరాత్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సోమవారానికి(మే 29) వాయిదా పడింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు నానా అవస్థలు పడ్డారు. డబ్బున్న వారు ఖరీదైన హోటల్స్‌లో బసచేయగా.. డబ్బు లేని వారు ప్లాట్‌ఫామ్‌లు, ఫుట్‌పాత్‌లపైనే నిద్రించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు క్రికెట్ ప్రేమికులను కంటతడి పెట్టిస్తున్నాయి.
ధోనికిదే చివరి మ్యాచ్..
'ధోని.. ధోని.. ధోని..' ప్రస్తుతం క్రికెట్ ప్రేమికులు ఈ పేరునే ఎక్కువుగా జపిస్తున్నారు. మాహీకిదే చివరి ఐపీఎల్ టోర్నీ అని చర్చ నడుస్తున్న తరుణంలో ఫ్యాన్స్ అతనిపై అంతులేని అభిమానం చూపిస్తున్నారు. గ్రౌండ్ ఏదైనా అక్కడ ధోని ఫ్యాన్స్‌తో స్టేడియం నిండిపోతుంది. ఒకప్పుడు చెన్నైలో మాత్రమే ఇలాంటి వాతావరణం మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడ వాలిపోతున్నారు. ఈ క్రమంలో సీఎస్కే అభిమానులు ఫైనల్ మ్యాచును వీక్షించడానికి భారీ సంఖ్యలో అహ్మదాబాద్ చేరుకున్నారు.
కానీ వారు కన్న కలలు ఫలించలేదు. వరుణుడి రూపంలో విలన్ ఎంటరై వారి ఆశలపై నీళ్లు చల్లాడు. అయినప్పటికీ వారిలో ఆత్మ విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. వర్షం తగ్గుముఖం పడుతుందన్న ఆశతో ఆదివారం రాత్రి 11 గంటల సమయం దాకా స్టేడియంలోనే నిరీక్షించారు. చివరకు వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు.. మ్యాచును సోమవారానికి(మే 29) వాయిదా వేశారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు తిరిగి తమ ఇళ్లకు వెళ్ళడానికి ఇష్టపడక అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ ఖరీదైన హోటల్లో బసచేయడానికి వారి దగ్గర కావాల్సినన్ని డబ్బులు లేవు. దీంతో అహ్మదాబాద్ లోని ప్లాట్‌ఫామ్‌లపై, ఫుట్‌పాత్‌లపై నిద్రించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇవాళైనా జరిగేనా..?
సోమవారం అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువని వాతావరణ శాఖ తెలిపింది. అందుకు తగ్గట్టుగా ప్రస్తుతానికి వాతావరణం అనుకూలంగా ఉన్నా.. మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికి ఎలా ఉంటుందో ఊహించలేం. 16 ఏళ్ల ఐపీఎల్ టోర్నీ చరిత్రలో రిజర్వు డే రోజునన ఐపీఎల్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. ఫైనల్ మ్యాచ్‌ని లైవ్‌లో చూసేందుకు టిక్కెట్స్ కొన్నవాళ్లు, ఇవాళ వాటిని స్టేడియానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవాళ కూడా మ్యాచ్ నిర్వహించడం వీలు కాకపోతే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించనున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నడూ సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు.