మూడు గంటల మ్యాచ్.. మూడు రోజులు..

మూడు గంటల మ్యాచ్.. మూడు రోజులు..

ఐపీఎల్ అంటేనే 20 – 20 మ్యాచ్.. మూడు గంటల్లో ముగుస్తుంది.. ఫటాఫట్ మ్యాచ్.. థనాధన్ హిట్టింగ్స్.. సినిమా చూసినంత సమయంలో.. రెండు దేశాల మధ్య మ్యాచ్ డిసైడ్ అవుతుంది. ఐపీఎల్ కిక్కు అంటే అదీ.. అలాంటి మ్యాచ్ మూడు రోజులు జరిగితే.. అది కూడా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగితే.. ఇప్పుడు అదే జరిగింది. 2023 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మూడు గంటల మ్యాచ్ ఫలితం కోసం మూడు రోజులు వెయిట్ చేశారు అభిమానులు.

ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఓ ఫైనల్ మ్యాచ్ టెస్టు మ్యాచును తలపించింది. అది డే అండ్ నైట్ టెస్టులా అనిపించింది ప్రేక్షకులకు. షెడ్యూల్ ప్రకారం మే 28వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు మొదలవ్వాల్సిన మ్యాచ్..వర్షం కారణంగా ఆలస్యం అయింది. వరుణుడు ఎంతకు శాంతించలేదు. నరేంద్ర మోదీ స్టేడియం చెరువును తలపించింది. కనీసం ఒక్క ఓవర్ కూడా పడలేదు. దీంతో చేసేదేమి లేక అంపైర్లు మ్యాచ్ ను రిజర్వ్ డేకు వాయిదా వేశారు. 

రిజర్వ్ డే ఏమైంది...

మే 28వ తేదీ వర్షం కారణంగా జరగాల్సిన మ్యాచ్ ఆగిపోవడంతో రెండో రోజూ కూడా జరుగుతుందా లేదా అని అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ. వర్షం మళ్లీ అడ్డు తగులుతుందా..ఫైనల్ లో ఎవరు గెలుస్తారు. మళ్లీ వర్షం పడితే ఏంటీ పరిస్థితి. సూపర్ ఓవర్ నిర్వహిస్తారా..లేదా అంపైర్లే విజేతను నిర్ణయిస్తారా అని ప్రేక్షకుల్లో ఆలోచనలు. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ..మే 29వ తేదీ సాయంత్రం 7 గంటలకు మ్యా్చ్ మొదలైంది. టాస్ పడింది. చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోయింది. అప్పుడప్పుడు చిరు జల్లులు పడినా..మ్యాచ్ ఆగిపోయేంత వర్షం మాత్రం రాలేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లు పూర్తిగా ఆడింది. సాయి సుదర్శన్, సాహా , గిల్ రాణించడంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు సాధించింది. 

అసలు కథ ఇప్పుడే మొదలైంది..

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అసలు సీస్ స్టార్టైంది. అప్పటి వరకు శాంతించిన వరుణుడు ఒక్కసారిగా నరేంద్ర మోదీ స్టేడియంపై విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ ఫైనల్పై పగబట్టాడా అన్నట్లు కుండపోతగా వానపడింది. ఇంకేంటి మళ్లీ మ్యాచ్ 9:30 నిమిషాలకు ఆగిపోయింది. 10 అయింది..అయినా తగ్గలేదు. 11 అయినా వాన వీడలేదు. 12 అయింది..ఆ రోజు కూడా దాటి ఐపీఎల్ ఫైనల్ మంగళవారంలోకి ప్రవేశించింది.  అప్పుడే వాన కొద్దిగా శాంతించింది. దీంతో గ్రౌండ్ సిబ్బంది మైదాన్ని ఆటకు సిద్ధం చేశారు. సరిగా 12 :10 గంటలకు మ్యాచ్ మళ్లీ మొదలైంది. అయితే వర్షం కారణంగా ఆటను 15 ఓవర్లకు కుదించారు. చెన్నై టార్గెట్ను 171 పరుగులుగా నిర్ణయించారు. ఈ సమయంలో రెచ్చిపోయి ఆడిన చెన్నై సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగుల చేసి ఐదోసారి ఐపీఎల్ టైటిల్ ను సాధించింది. 

చివరి ఓవర్..నరాలు తెగే ఉత్కంఠ..

చివరి ఓవర్..చెన్నై విజయానికి 13 పరుగులు కావాలి. ఈ దశలో చివరి ఓవర్ వేసిన మోహిత్‌ శర్మ... తొలిబంతికి పరుగు ఇవ్వలేదు. ఆ తర్వాత మూడు బంతులకు మూడు పరుగులు ఇచ్చాడు. ఉత్కంఠ తారా స్థాయికి చేరుకుంది. 2 బంతుల్లో 10 పరుగులు చేయాలి. క్రీజులో జడేజా ఉన్నాడు. ఐదో బంతిని సిక్స్గా మలిచాడు. గుజరాత్ టైటాన్స్ లో కలవరం మొదలైంది. చివరి బంతికి పుల్‌ టాస్‌ వేయడంతో...ఫైన్‌లెగ్‌ వైపు ఫ్లిక్ చేశాడు. అది కాస్తా బౌండరీ దాటింది. దీంతో  స్టేడియంలో పసుపు దళం సంబరాలు అంబరాన్నంటాయి.