చెన్నైతో జరుగుతోన్న ఫైనల్ పోరులో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించింది. వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా(54) 'సాహో' అనిపించగా, అన్‌క్యాపెడ్ ప్లేయర్ సాయి సుదర్శన్(96) విధ్వంసం సృష్టించాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 96 పరుగులు చేసిన ఈ యువ క్రికెటర్ తృటిలో సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. పథిరణ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన సుదర్శన్.. మూడో బంతికి ఎల్బీగా ఔటయ్యాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు మంచి శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు సాహా- గిల్ జోడి 67 పరుగులు జోడించారు. అనంతరం 39 పరుగుల వద్ద గిల్ స్టంపౌట్‌గా వెనుదిరిగగా, సాయి సుదర్శన్‌తో జత కలిసిన సాహా.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 64 పరుగులు జోడించారు. ఆపై సాయి సుదర్శన్ జోరు సాగింది. చెన్నై బౌలర్లు ఈ యువ క్రికెటర్ను కట్టడి చేయలేకపోయారు. ఆఖరిలో హార్దిక్ పాండ్యా(21; 12 బంతుల్లో రెండు సిక్సులు) కూడా మెరుపులలు మెరిపించడంతో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. సీఎస్‌కే బౌలర్లలో పతీరానా రెండు వికెట్లు తీయగా.. జడేజా, దీపక్ చహర్‌లు చెరొక వికెట్ తీశారు.