ఐపీఎల్ 2023 తుది సమరానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ తుదిపోరులో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఆదివారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే ఈ మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మ్యాచ్ జరిగే సమయంలో తేలకపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. అదే జరిగితే ఐపీఎల్ 2023 విజేతను ఎలా నిర్ణయిస్తారు..? ఏ జట్టు టైటిల్ సొంతం చేసుకుంటుందో..? ఇప్పుడు తెలుసుకుందాం..
యూక్యూవెథర్ రిపోర్టు ప్రకారం అహ్మదాబాద్‌లో ఆదివారం సాయంత్రం 40 శాతం వర్షం కురిసే అవకాశముంది. అదే జరిగితే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావచ్చు. ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. రిజర్వ్ డే ఉంది కనుక సోమవారం నాడు ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ఆదివారం టాస్ వేశాక వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కాకపోతే, మరలా సోమవారం(రిజర్వ్‌డే) రోజు టాస్ వేసి మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ ఆట మధ్యలో ఆగిపోతే.. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి సోమవారం నాడు మ్యాచ్ కొనసాగిస్తారని తెలుస్తోంది.
ఈ మ్యాచ్‌లో ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం ఐదేసి ఓవర్లు అడాల్సి ఉంటుంది. అదీ సాధ్యపడకపోతే.. రాత్రి 1.20 సమయంలో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఒకవేళ అందుకు ఆస్కారం లేకపోతే గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. ఎందుకంటే గ్రూప్ దశలో ఈ జట్టు చెన్నై కన్నా మెరుగైన స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, ఇదే వేదికగా జరిగిన ముంబై, గుజరాత్ రెండో క్వాలిఫైయర్‌లో కూడా వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.