గుజరాత్ ధనాధన్ బ్యాటింగ్.. ముంబై ముంగిట భారీ లక్ష్యం

గుజరాత్ ధనాధన్ బ్యాటింగ్.. ముంబై ముంగిట భారీ లక్ష్యం

ముంబై ఇండియ‌న్స్‌తో జరుగుతున్న క్వాలిఫైయ‌ర్ -2లో గుజ‌రాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. మైదానం నలువైపుల బౌండరీలు బాదుతూ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. భారత యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ(129) సాధించాడు. ఈ సీజన్ లో అతనికి ఇది మూడో సెంచరీ కావటం గమనార్హం.  

వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. గుజరాత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ బ్యాటర్లు మొదట్లో కాస్త నిలకడగా ఆడినా.. ఆ తరువాత దూకుడు పెంచారు. ఎడా పెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా యువ క్రికెటర్ శుభ్‌మ‌న్ గిల్ అచ్చొచ్చిన స్టేడియంలో రెచ్చిపోయి ఆడాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి శ‌త‌కంతో(129) ముంబై బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. బౌల‌ర్ ఎవ‌రైనా బంతిని బౌండ‌రీకె అన్నట్లుగా గిల్ ఇన్నింగ్స్ సాగింది. 

గిల్‌కు తోడు సాయి సుదర్శన్(43), హార్దిక్ పాండ్యా(28) కూడా రాణించడంతో గుజ‌రాత్ 233 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. గిల్ ధాటికి గత మ్యాచ్ ముంబై హీరో ఆకాశ్ మ‌ధ్వాల్ ధారాళంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మ‌ధ్వాల్, పీయూష్ చావ్లా చెరో వికెట్ తీసుకున్నారు.