ఐపీఎల్ 2023 తుది సమరానికి మరో అడుగు దూరంలో ఉన్నాం. మరికొన్ని గంటల్లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై, గుజరాత్ జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఏ జట్టు గెలుస్తుందన్న దానిపై అభిమానులు రకరకాల లెక్కలేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలేంటి? విజేతగా నిలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువుగా ఉన్నాయి? అన్నది ఇప్పుడు చూద్దాం..
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన గుజరాత్, ఈ టోర్నీ అమాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశలో 14 మ్యాచులలో పదింట గెలిచి నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అనంతరం తొలి క్వాలిఫయర్ పోరులో చెన్నై చేతిలో ఓడినా, రెండో క్వాలిఫయర్ మ్యాచులో ముంబైపై విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక చెన్నై విషయానికొస్తే.. లీగ్ దశలో పడుతూ లేస్తూ ప్రయాణం సాగించినా.. కీలక మ్యాచులో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
రెండు విభాగాల్లోనూ పటిష్టంగా గుజరాత్..
బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ గుజరాత్ పటిష్టంగా కనిపిస్తోంది. యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండటం గుజరాత్‌కు అతి పెద్ద బలం. ఇప్పటికే ఈ టోర్నీలో మూడు సెంచరీలు చేసిన గిల్ 800కి పైగా పరుగులు చేశాడు. అలాగే వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియాలతో కూడిన మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. మహమ్మద్ షమీ, రషీద్‌ఖాన్ జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్నారు. షమీ పేస్‌తో బ్యాట్లర్లను బయపడుతుంటే.. రషీద్ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. అలాగే సీనియర్ పేసర్ మోహిత్ శర్మతో పాటు యంగ్ స్పిన్సర్ నూర్ అహ్మద్ కూడా రాణిస్తుండటం గుజరాత్ కు అదనపు బలం.
ఓపెనర్లపైనే చెన్నై ఆశలు..
చెన్నై బ్యాటింగ్ పరంగా ఓపెనర్లపైనే ఎక్కువుగా ఆధారపడుతోంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే మంచి ఆరంభాల్ని ఇస్తు న్నారు. ఆ తరువాత క్రీజులోకి వస్తున్న అజింక్యా రహానే, శివమ్ దూబే, జడేజా మెరుపులు మెరిపిస్తుడటం జట్టుకు కలిసొస్తోంది. అయితే వీరు మినహా మిగిలిన ఏ ఒక్కరూ సామర్థ్యం మేర రాణించడం లేదు. అంబటి రాయుడు, మోయిన్ అలీ, ఎంఎస్ ధోని వంటి హిట్టర్లు ఉన్నా స్థాయికి తగ్గట్టు ఆడటం లేదు. ఇక చెన్నై బౌలింగ్ విషయానికొస్తే.. జడేజా, తీక్షణపైనే జట్టు ఎక్కువుగా ఆశలు పెట్టుకుంటోంది. దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, మతీష పతిరాణా రూపంలో ముగ్గురు పేసర్లు ఉన్నా.. ఏ మ్యాచులో రాణిస్తారో వారికే అర్థమవ్వడం లేదు.
చెరో ఒక మ్యాచులో..
ఈ సీజన్ లో ఈ రెండు జట్లు ఇప్పటికే రెండుసార్లు ఎదురుపడ్డాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. గుజరాత్ 4 బంతులు మిగిలివుండగానే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. మరోసారి ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌లో తారసపడ్డాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచులో ధోనీ సేన గుజరాత్ టైటాన్స్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 172 పరుగులు చేయగా.. హార్దిక్ టీమ్ దాన్ని ఛేదించలేకపోయింది 157 పరుగులే కుప్పకూలింది.
గుజరాత్‌కే అవకాశాలు ఎక్కువ..
డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన గుజరాత్‌కే ఫైనల్ మ్యాచులో విజయావకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. కాకుంటే ధోనికిదే చివరి ఐపీఎల్ టోర్నీ అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడతాయనడంలో సందేహం లేదు.