ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫైయర్ -2 పోరులో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ మెరుపు సెంచరీ సాధించాడు. ఆది నుంచి ముంబై బౌలర్లపై ఎదురుదాడికి గిల్.. ఈ సీజన్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. గిల్ ధాటికి గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
గిల్ వీరబాదుడు..
భారత యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ ఐపీఎల్ 2023లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. సన్‌రైజర్స్ పై తొలి ఐపీఎల్ సెంచరీ అందుకున్న గిల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రెండో సెంచరీ బాది ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలపై నీళ్లు చల్లాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో మూడో సెంచరీ నమోదు చేసి ఆ జట్టు బౌలర్లను నిద్రలేని రాత్రి గడిపేలా చేశాడు.
పవర్ ప్లేలో నిదానంగా ఆడిన గిల్.. ఆ తరువాత జోరు పెంచి 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అక్కడినుండి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఆకాశ్ మధ్వాల్ వేసిన 12 వ ఓవర్లో మూడు సిక్స్‌లు బాదిన గిల్, పీయూష్ చావ్లా వేసిన 13వ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. అనంతరం 49 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న గిల్ 7 ఫోర్లు,10 సిక్స్‌ల సాయంతో 129 పరుగులు చేశాడు.