- నేటి నుంచి ఐపీఎల్–16
అహ్మదాబాద్: మండు వేసవిలో.. పరుగుల విందును అందించే క్రికెట్ మెగా లీగ్ ‘ఐపీఎల్ స్వీట్–16’ టోర్నీకి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో నాలుగుసార్లు చాంపియన్చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య శుక్రవారం జరిగే తొలి పోరుతో లీగ్‌కు తెరలేవనుంది. బరిలోకి దిగిన తొలిసారే హేమాహేమీలను మట్టి కరిపిస్తూ టైటిల్ ఎగరేసుకుపోయిన పాండ్యాసేన మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేయాలని టార్గెట్‌తో ఆట మొదలుపెడుతుంటే.. కెరీర్ చివర్లో ఉన్న లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐదో టైటిల్ అందించి చెన్నైతో బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాడు. బలం, బలగం, రికార్డులు, ఎక్స్‌పీరియెన్స్ పరంగా చూస్తే సీఎస్‌కే ఓ మెట్టు పైనే ఉన్నా.. గుజరాత్ కుర్రాళ్లనూ తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
నో రిస్ట్రిక్షన్స్..
కరోనా కారణంగా గత మూడు సీజన్లను ఆంక్షల మధ్య వీక్షించిన ఫ్యాన్స్‌కు ఈసారి పండుగే. ఎలాంటి ఆంక్షలు లేకుండా స్టేడియానికి వచ్చి పరుగుల విందును ఆస్వాదించొచ్చు. 10 జట్లు బరిలోకి దిగుతున్న మెగా లీగ్‌లో 74 మ్యాచ్‌లకు12 నగరాలు ఆతిథ్యమిస్తున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్‌లో 4 మ్యాచ్‌లు (క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్) జరగనున్నాయి. ప్రస్తుతానికి లీగ్ వరకే షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన బీసీసీఐ.. నాకౌట్ మ్యాచ్ తేదీలను, వేదికలను తర్వాత ప్రకటించనుంది. మే 28న ఫైనల్ జరగనుంది. కరోనా కంటే ముందు ఉన్నట్లుగా మ్యాచ్‌లను ఇంటా, బయటా పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
ధోనీ ఫిట్!
పేరుకు చెన్నై, గుజరాత్ మ్యాచ్ అనుకున్నా.. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ధోనీ, పాండ్యా ఆట కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య గురు-శిష్యుల అనుబంధం ఉండటంతో గెలుపు ఎవర్ని వరిస్తుందో చూడాలి. కాలి గాయంతో బాధపడుతున్న ధోనీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంపై సందేహాలు నెలకొన్నా.. అతను ఫిట్‌గా ఉన్నట్లు సమాచారం. స్టోక్స్ స్సెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతుండగా, రుతురాజ్, తెలుగుతేజం అంబటి రాయుడు, కాన్వే, అలీ చెలరేగితే భారీ స్కోరు ఖాయం. ఆల్‌రౌండర్లుగా జడేజా, దీపక్ చాహర్‌పై అధిక భారం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్లుగా రాజవర్ధన్, రహానె, షేక్ రషీద్, నిశాంత్ సంధూ సేవలందించేందుకు రెడీగా ఉన్నారు. ఇక శుభ్‌మన్ గిల్, శ్రీకర్ భరత్, సాయి సుదర్శన్, మాథ్యూ వేడ్, విలియమ్సన్‌తో కూడిన బలమైన బ్యాటింగ్ లైనప్ గుజరాత్ సొంతం. బౌలింగ్ ఆల్‌రౌండర్స్‌గా రషీద్ ఖాన్, రాహుల్ టెవాటియా అత్యంత కీలకం కానున్నారు. పేసర్ మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జోష్ లిటిల్ బౌలింగ్‌లో ఆకట్టుకుంటే జీటీ గెలుపు ఈజీ.