జడేజా vs ధోని ఫ్యాన్స్: ఏంటి ఈ వివాదం?

జడేజా vs ధోని ఫ్యాన్స్: ఏంటి ఈ వివాదం?

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానుల మధ్య మాటల యుద్ధం తీరా స్థాయికి చేరుకుంది. నిన్నమొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న జడేజా.. ఇప్పుడు డైరెక్ట్ గానే మహేంద్రుడు అభిమానులతో తాడో పేడో తేల్చుకుంటున్నాడు. పరోక్షంగా ట్వీట్లు చేస్తూ అందరికి అర్థమయ్యేలాగే కౌంటర్లు వేస్తున్నాడు. ఓ మ్యాచ్ లో జడేజా బాగా ఆడుతున్నా.. ధోనీ బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్న అతని అభిమానులు జడ్డూని ఔట్ కావాలని అరవడం బాధించింది. ఆనాటి నుంచి ఈ వివాదం మరింత ముదిరింది. 

గుజరాత్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో జడేజా ఆల్ రౌండర్ ప్రదర్శనతో మెప్పించాడు. బ్యాటింగ్‌లో 22 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. కీలకమైన మిల్లర్, శనక వికెట్లను తీశాడు. ఈ ప్రదర్శన.. చెన్నై విజయానికి బాగా ప్లస్ అయింది. దీంతో 'మోస్ట్ వాల్యూబుల్ అసెట్ ఆఫ్ ది మ్యాచ్'గా జడేజా నిలిచాడు. అందుకు సంబంధించిన ఫొటోని ట్వీట్ చేసిన జడ్డూ.. 'అప్ స్టాక్స్ గుర్తించింది కానీ.. కొందరు ఫ్యాన్స్ మాత్రం గుర్తించలేదు..' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ ట్వీట్ చూసిన ఎవరికైనా.. అది ధోనీ ఫ్యాన్స్ కోసం పెట్టిన ట్వీట్ అని ఈజీగా అర్థమైపోతుంది.

వాస్తవానికి జడేజాకు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యానికి గతేడాది నుంచే విబేధాలున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో ధోని సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆ పగ్గాలు చేపట్టిన జడ్డూ జట్టును విజయాల బాటలో నడిపించలేకపోయాడు. వరుస ఓటములతో జట్టు డీలా పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన సీఎస్‌కే యాజమాన్యం.. అతన్ని తప్పించి మళ్లీ ధోనికి ఆ బాధ్యతలు అప్పగించింది. ఆనాటి నుంచి జడేజాకు, సీఎస్‌కే యాజమాన్యానికి మధ్య కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. మేనేజ్‌మెంట్‌ చేసిన అవమానభారాన్ని ఎలాగోలా భరిస్తున్న జడ్డూకు, చెన్నై ఫ్యాన్స్‌ నుంచి సహకారం లేకపోవడం మరింత బాధ పెడుతోంది. ఏదేమైనా ఈ ఏడాది ధోని అభిమానులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

https://twitter.com/imjadeja/status/1661110781512142849