ఐపీఎల్ 2023 టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మొదటి క్వాలిఫైయర్ పూర్తవగా, ఈ మ్యాచులో ధోని సారథ్యంలోని చెన్నై జట్టు, హార్దిక్ నేతృత్వంలోని గుజరాత్ ను 15 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. దీంతో చెన్నై ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవడమే కాకుండా పదోసారి ఫైనల్ చేరిన జట్టుగా అవతరించింది. ఇక ఇవాళ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది కనుక గెలుపు ఎవరిదన్న దానిపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇరు జట్లలో గెలుపెవరిది..? జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి..? అన్నది ఓసారి గమనిద్దాం..
ఉఫ్ మని ఊదేసే బ్యాటర్లు
ఎలిమినేటర్ మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. కృనాల్ పాండ్యా నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. 2023 మే24 బుధవారం సాయంత్రం 7:30 గంటలకు చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో ఓడిన జట్టు టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది కనుక విజయం కోసం ఇరు జట్లు ఆఖరి దాకా పోరాడతాయనడంలో సందేహం లేదు. కావున ఈ మ్యాచ్ హోరీహోరీగా సాగనుంది. వరుసగా రెండు సీజన్ల పాటు ప్లేఆఫ్స్‌కు దూరమైన ముంబై, ఈ ఏడాది చాలా పట్టుదలతో కనిపిస్తోంది. టోర్నీ ఆరంభంలో వరుస ఓటములతో నిరాశపరిచినా, ఆ తరువాత పుంజుకున్న తీరు అమోఘం. బ్యాటింగ్ పరంగా ఎంత పెద్ద టార్గెట్ అయినా ఉఫ్ మని ఊదేసే బ్యాటర్లు ముంబైకి ప్రధాన బలం. మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ నిలకడగా రాణిస్తూ జట్టును విజయాల బాట నడిపిస్తున్నారు. కానీ బౌలర్లే ఆ జట్టుకు భారంగా తయారయ్యారు. వెటరన్ బౌలర్ పీయూష్ చావ్లా మినహా ఏ ఒక్కరూ రాణించడం లేదు. మొత్తానికి ముంబై బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తున్నా, బౌలింగ్ లో వీక్ అన్నది చెప్పకనే చెప్పవచ్చు.
విదేశీ ఆటగాళ్ళైపైనే భారం
ఇక లక్నో విషయానికొస్తే.. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో దూరమైనా, కృనాల్ పాండ్యా జట్టును నడిపిస్తున్న తీరు అద్భుతం. క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్ లు రాణిస్తే.. ముంబైకు కష్టాలు తప్పకపోవచ్చు. కాకుంటే ఆ జట్టు బ్యాటింగ్ పరంగా ఎక్కువుగా లక్నో విదేశీ ఆటగాళ్ళైపైనే ఆధారపడుతోంది. దీపక్ హుడా, ఆయుష్ బధోని, కృష్ణప్ప గౌతమ్ వంటి లోకల్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ సామర్థ్యం మేర రాణించడం లేదు. ఏదో అడపా దడపా రాణిస్తున్నా కీలక మ్యాచుల్లో చేతులెత్తేస్తున్నారు. కాకుంటే చెపాక్ వేదిక స్పిన్నర్లకు స్వర్గధామం కనుక అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా త్రయం రాణిస్తే.. లక్నో మ్యాచుపై పట్టు సాధించవచ్చు.
చెపాక్ పిచ్ ఏం చెప్తుంది?
ఇక టోర్నీ ఆరంభంలో బ్యాటింగ్ కు అనుకూలించిన చెపాక్ పిచ్, రెండో అర్ధ భాగంలో బౌలర్లకు అనుకూలిస్తోంది. మొదటి క్వాలిఫైయర్ మ్యాచులో చూసుకున్నా, చెన్నై నిర్ధేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ చేధించలేకపోయింది. తీక్షణ, జడేజా జోడీని ఎదుర్కోలేకపోయిన గుజరాత్ బ్యాటర్లు.. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 157 పరుగులకే కుప్పకూలారు. ఈ గణాంకాల ప్రకారం.. టాస్ గెలిచినా జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపవచ్చు. ఇక లీగ్ దశలో ఈ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచులో లక్నో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 177 పరుగులు చేయగా, ముంబై 172 పరుగులకే పరిమితమైంది. కాకుంటే ఎక్కవ సార్లు ప్లేఆఫ్స్ ఆడిన అనుభవం, ఎక్స్పెరియన్స్ ఉన్న ఆటగాళ్లు ఉండటం ముంబైకి కలిసొచ్చే అంశం. ఇలా జట్ల బలాబలాల పరంగా చూస్తే.. ముంబైదే కాస్త పైచేయిగా ఉంది.