భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్ష కురిపించాడు. ధోనిని ఒక మాంత్రికుడిగా వర్ణించిన హేడెన్, అతను చెత్తను కూడా ఒక నిధిలా మార్చగలడని కితాబిచ్చాడు. "చూడడానికి ధోని ప్రశాంతంగా కనిపిస్తాడు..కానీ మైదానంలో అతను చేసే వ్యూహరచనలు ప్రత్యర్థి జట్లకు ఓ సవాల్ విసురుతాయి. నా వరకూ అతనో అద్భుతం. పరిస్థితులను గమనించడం, అందుకు తగినట్లు పని చేసుకుపోవడం అతనికి అలవాటు. ఇండియన్ క్రికెట్‌తో అదే చేశాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌తోనూ చేస్తున్నాడు.." అని హేడెన్ చెప్పుకొచ్చాడు.
ఇక ధోనికిదే చివరి ఐపీఎల్ టోర్నీ అన్న వార్తలపై స్పందించిన హేడెన్.. 'వచ్చే ఏడాది అతడు ఆడతాడా? లేదా? అన్నదానితో సంబంధం లేదు. నా వరకూ అతడు ఆడతాడని అనుకోవడం లేదు. కానీ చెప్పలేం. ధోనీ అంటే అలానే ఉంటది మరి" అని హేడెన్ తెలిపాడు. కాగా, గత ఐపీఎల్ సీజన్ లో చెన్నై ప్రదర్శన అంతంత మాత్రమే అన్న సంగతి అందరికీ విదితమే. 14 మ్యాచుల్లో కేవలం నాలుగింటిలో విజయం సాధించిన చెన్నై పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలించింది. అలాంటి జట్టు పుంజుకొని ఏడాది ముగిసేసరికి ఫైనల్ చేరడంలో కెప్టెన్‌గా ధోనీ వ్యూహాలు ముఖ్యమైన పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.
గత సీజన్‌లోనూ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నా.. 'టోర్నీ ప్రారంభానికి ముందు అతను కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం.. జడేజాకు ఆ బాధ్యతలు అప్పగించటం.. జట్టు వరుస ఓటములు.. మరలా ధోనీకి బాధ్యతలు..' ఇలాంటి అనేక సంఘటనలు జట్టు వ్యూహాలను దెబ్బతీశాయి. ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, రాణించలేరు అనుకున్న ఆటగాళ్లతోనే విజయాలు రాబడుతున్నాడు ధోని. అజింక్యా రహానే, శివమ్ దూబే, తుషార్ దేశ్ పాండే.. వంటి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నాడు.