ఐపీఎల్ 2023 ఫైనల్ పోరుకు మరో అడుగు దూరంలో ఉన్నాం. నేడు(మే 26) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగబోయే క్వాలిఫయర్–2లో విజయం సాధించిన జట్టు ఫైనల్ లో అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో ముంబై, గుజరాత్ జట్ల బలబలాలు ఎలా ఉన్నాయి..? విజయావకాశాలు ఏ జట్టులకు ఎక్కువ ఉన్నాయి..? అన్నది ఇప్పుడు చూద్దాం..
రషీద్, నూర్ అహ్మద్ పైనే గుజరాత్ ఆశలు..
లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకెళ్లిన గుజరాత్ అనూహ్యంగా తొలి క్వాలిఫయర్ మ్యాచులో చైన్నై చేతిలో ఓటమిపాలైంది. చెన్నై నిర్ధేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. గుజరాత్ తరుపున శుభ్‌మాన్ గిల్, విజయ శంకర్ మినహా ఎవరూ నిలకడగా రాణించడం లేదు. వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా వంటి నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా బ్యాట్ ఝుళిపించడం లేదు. ఇక బౌలింగ్ విభాగంలో గుజరాత్ పటిష్టంగానే కనిపిస్తోంది. మహ్మద్ షమీ, మోహిత్ శర్మతో పాటు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉండటం గుజరాత్ కు కలిసొచ్చేదే. వీరిద్ధపరు రాణించడంపైనే గుజరాత్ గెలుపు ఆశలు ఆధారపడ్డాయి.
బ్యాటింగే ముంబై ఆయుధం..
రోహిత్ శర్మ, ఇషన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, నేహల్ వధేరా రూపంలో ముంబై బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టేలా ఉంది. రోహిత్, ఇషన్ కిషన్ మంచి ఆరంభం ఇస్తే.. గ్రీన్, సూర్యవ్, టిమ్ డేవిడ్ జట్టు స్కోరును అలవోకగా రెండొందలు దాటించగలరు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. ముంబై బౌలింగ్ లైనప్ గురించి. బుమ్రా, ఆర్చర్ లోటు జట్టులో బాగా కనిపిస్తోంది. జాసన్ బెరెన్‌డార్ఫ్, క్రిస్ జోర్డాన్ రూపంలో విదేశీ బౌలర్లు ఉన్నా ధారాళంగా పరుగులిస్తున్నారు. వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఒక్కరే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసున్నాడు. గత మ్యాచ్ నయా సంచలనం ఆకాశ్ మద్వాల్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. టైటాన్స్ ఓపెనర్లను ఆపగలిగితే ముంబై విజయావకాశాలు చాలా మెరుగవుతాయి.
అహ్మదాబాద్ పిచ్ ఏం చెప్తోంది..
నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు సహకరించనుంది. అలాగే మంచి పేస్, బౌన్స్ లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునేందుకే మొగ్గు చూపే అవకాశముంది. ఛేదనలో మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. మొత్తంగా జట్ల బలాబలాలను బట్టి గురు, శిష్యుల మధ్య పోరులో ముంబైకే విజయావకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.