భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అదే జరిగితే ధోని ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో బరిలోకి దిగే అవకాశం లేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచులో ధోని అంపైర్లతో వాగ్వాదానికి దిగడమే అందుకు ప్రధాన కారణం. ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో గొడవకు దిగిన ధోని.. 4 నిమిషాల సమయాన్ని వృథా చేశాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ.. అతనికి జరిమానా లేదా బ్యాన్ విధించే అవకాశం ఉందని ఒక ప్రముఖ క్రీడా వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
మహేంద్ర సింగ్ ధోనీ అనగానే అందరకీ గుర్తొచ్చేది.. మిస్టర్ కూల్ అనే పదం. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రశాంతంగా కనిపించే ధోని, మ్యాచ్ గెలిచినా.. ఓడినా పెద్దగా తన భావోద్వేగాలను బయటపెట్టడు. అంతర్జాతీయ మ్యాచుల్లో అలాంటి సంఘటనలు ఎన్నో సార్లు చూశాం.. అలాంటి ధోనీ ఐపీఎల్ 2023లో తన భావోద్వేగాలను అదపు చేయలేకపోతున్నాడు. సహచర ఆటగాళ్లపై సీరియస్ అవుతున్నాడు. మంగళవారం గుజరాత్ తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచులో ధోనీ ఏకంగా అంపైర్లతో గొడవపడ్డాడు. అది కూడా ఒక బౌలర్ కోసం. రూల్స్ పాటించని ధోని, మైదానంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగడం నిషేధానికి దారితీస్తోంది.
ఏం జరిగిందంటే..
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసేందుకు చెన్నై పేసర్ మతీష్ పతిరాణా సిద్దయ్యాడు. కానీ అతడు బౌలింగ్ చేసేందుకు ఆన్ ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, అనిల్ చౌదరి నిరాకరించారు. ఆ ఓవర్ వేయడానికి ముందు పతిరాణా దాదాపు 9 నిమిషాల పాటు మైదానంలో లేడు. విరామం తీసుకొని మైదానమ్ వెలుపల ఉన్నాడు. దీంతో నేరుగా డగౌట్ నుంచి వచ్చిన పతిరాణాను బౌలింగ్ చేసేందుకు అంపైర్లు అనుమతించలేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు 8 నిమిషాల పాటు మైదానంలో లేనియెడల బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయడం కుదరదు. అందుకే అంపైర్లు నిరాకరించారు. అయితే ధోని అలాంటివేం పట్టనట్లు.. అంపైర్ల వద్దకు వచ్చి వారితో వాగ్వాదానికి దిగుతాడు. చివరకు అతని ప్రయత్నం సఫలమవ్వడంతో పతిరాణా ఆ ఓవర్ కొనసాగించాడు. ఈ ఘటనతో ధోనీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధోని చేసింది తప్పు అంటూ విదేశీ ఆటగాళ్లు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో మ్యాచ్ రిఫరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. ఒకవేళ ధోనీపై నిషేధం విధిస్తే ఫైనల్‌కు ముందు సీఎస్కే గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి.
https://twitter.com/RanajoyMitra5/status/1661218173100892160