టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించిన ముంబై జట్టు తదుపరి మ్యాచుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు ఫ్లైట్‌లో వెళ్తుండగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ నిద్రపోతుండగా.. భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అతని నోట్లో నిమ్మరసం వేసి నిద్ర లేపాడు. ఈ చిలిపి సంఘటన నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.
లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో 26 పరుగులు చేసిన తిలక్ వర్మ తన వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచులు.. ప్రాక్టీస్.. అంటూ అలసిపోయిన ఈ హైదరాబాదీ ఫ్లైట్‌లో దొరికిన కాస్త సమయంలో నిద్రపోతుండగా సూర్య ఆ నిద్రను దూరం చేశాడు. గాఢ నిద్రలో ఉన్న తిలక వర్మ.. కాస్త నోరు తెరిచి పడుకున్నాడు. అదే అదునుగా భావించిన సూర్య.. ఎయిర్ హోస్టెస్ నుంచి ఓ నిమ్మచెక్కను తీసుకొని కొన్ని చుక్కలు తిలక్ వర్మ నోట్లో వేశాడు. పులుపు రుచి తగిలే సరికి తిలక్ వర్మ ఒక్కసారిగా నిద్ర లేచి ఏం జరిగిందో అర్థం కాక అటూ ఇటూ చూశాడు. అందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇక రెండో క్వాలిఫయర్ పోరులో ముంబై ఇండియన్స్ జట్టు.. గుజరాత్ టైటన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మే 26న శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లో అడుగు పెట్టనుంది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. తొలి క్వాలిఫయర్ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్‌ను 15 పరుగుల తేడాతో మట్టి కరిపించింది.