IPL 2024 Auction: అందరి కళ్లు సమీర్ రిజ్వీపైనే.. ఎవరీ ఆటగాడు?

IPL 2024 Auction: అందరి కళ్లు సమీర్ రిజ్వీపైనే.. ఎవరీ ఆటగాడు?

ఐపీఎల్ 2024 మినీ వేలానికి కౌంట్‌డౌన్ మొద‌లైంది. రేపు(డిసెంబర్ 19) దుబాయ్‌లోని కోకో-కోలా అరేనా వేదికగా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి వేలంపాట షురూ కానుంది. మొత్తం 77 ఖాళీలు ఉండగా, 333 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుకోనున్నారు. ఇదిలావుంటే ఈ మినీ వేలంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ యువ ఆల్ రౌండర్ కోట్లు కొల్లగొడతాడని భారత మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఆ క్రికెటర్ ఎవరు..? ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

హెడ్, స్టార్క్, కమ్మిన్స్

నిజానికి ఐపీఎల్ వేలం అనగానే అందరికి గుర్తొచ్చేది.. విదేశీ క్రికెటర్లు. అంతర్జాతీయ అనుభవం, అత్యుత్తమ గణాంకాలు ఉన్న వారి కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడూ అలాంటి క్రికెటర్లు చాలా మందే వేలంలో ఉన్నారు. మిచెల్ స్టార్క్‌, గెరాల్డ్ కోయెట్జీ, పాట్ కమ్మిన్స్, హ్యారీ బ్రూక్, వనిందు హసరంగా, ట్రావిస్ హెడ్‌ వంటి పలువురు స్టార్ క్రికెటర్లు రేపు కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, వీరందరికి మించి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వీ అనే యువ క్రికెటర్ పేరు ఎక్కువగా వినబడుతోంది. ఇతని కోసం ప్రాంఛైజీల మధ్య వార్ నడుస్తుందని మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, ఆకాశ్ చోప్రా, అభినవ్ ముకుంద్ కథలు కథలుగా చెప్తున్నారు. 

సమీర్ రిజ్వీ

ఈ 20 ఏళ్ల యువ క్రికెటర్ ఉత్తర్ ప్రదేశ్, మీరట్ కు చెందిన వాడు. రైట్ ఆర్మ్ బ్యాటరైన రిజ్వీ మంచి ఆఫ్ స్పిన్నర్ కూడానూ. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించగల సమర్ధుడు. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడగల సత్తా ఉన్నవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మంచి ఆల్ రౌండర్. అందువల్లే ఇతనిపై హైప్ క్రియేట్ అవుతోంది.

ఇటీవల జరిగిన యూపీ టీ20 లీగ్ లో కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రిజ్వీ టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 104 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అలాగే, అండర్ 23 స్టేట్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ఉత్తరప్రదేశ్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన రిజ్వీ.. యూపీ జట్టును విజేతగా నిలిపాడు. అరుణ్ జైట్లీ వేదికగా ఉత్తరాఖండ్‌ తో జరిగిన ఫైనల్లో రిజ్వీ 50 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు కీలక పాత్ర పోషించాడు. మరి ఈ యువ క్రికెటర్ అంచనాలు అందుకోగలడా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.