IPL 2024: ఐపీఎల్ మ్యాచ్‌లో రాజకీయ నినాదాలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

IPL 2024: ఐపీఎల్ మ్యాచ్‌లో  రాజకీయ నినాదాలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఐపీఎల్ 2024లో భాగంగా మంగ‌ళ‌వారం(మే 07) ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో కొందరు అభిమానులు రాజకీయ నినాదాలు చేశారు. ఆప్ అధినేత, లిక్కర్ స్కామ్ కేసులో జైలుకెళ్లిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అనుకూలంగా ఆ పార్టీ అభిమానులు కొందరు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

కేజ్రీవాల్‌కు మద్దతుగా టీషర్ట్స్ ధరించి మ్యాచ్‌కు హాజరైన అభిమానులు.. ప్లకార్డ్స్ కూడా ప్రదర్శించారు. పోలీసుల కళ్లు గప్పి వారు ఆ వస్తువులను మైదానంలోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆసక్తిగా మ్యాచ్ తిలకిస్తున్న అభిమానుల ఎదుట నిలబడి వారు నినాదాలు చేశారు. దీంతో ఇతరులకు ఇబ్బంది కలిగించినందుకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.  

"మా సిబ్బంది స్టేడియంలోని వివిధ పాయింట్లలో మోహరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. చట్టపరమైన చర్యల తర్వాత వారు విడుదల చేయబడతారు. ప్రేక్షకులందరూ ఆటను ఆస్వాదించమని కోరుతున్నాం. స్టేడియంలో ఎలాంటి రాజకీయ పరమైన కార్యకలాపాలకు పాల్పడవద్దని మేము సూచిస్తున్నాం.." అని ఢిల్లీ పోలీసులు ప్రకటనలో తెలిపారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 221 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో రాయల్స్ 201 పరుగులకు పరిమితమైంది.