ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. రాత్రి 7:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సొంతగడ్డపై ఈ మ్యాచ్ లో గెలిచి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని గుజరాత్ భావిస్తుంటే..ఈ మ్యాచ్ లో గెలిచి వరుస పరాజయాలకు బ్రేక్ వేయాలని పంజాబ్ చూస్తుంది. ఇరు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం.
గుజరాత్ టైటాన్స్:
ఐపీఎల్ లో గుజరాత్ అంచనాలను అందుకుంటుంది. హార్దిక్ పాండ్య, మహమ్మద్ షమీ లాంటి స్టార్ ఆటగాళ్లు దూరమైనా ఆ జట్టు మంచి ప్రదర్శన చేస్తుంది. కొత్త కెప్టెన్ గిల్ సారధ్యంలో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లాడితే రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో ముంబైతో గెలిచి శుభారంభం చేసినా.. ఆ తర్వాత చెన్నై చేతిలో ఘోరంగా ఓడింది. అయితే సొంతగడ్డపై సన్ రైజర్స్ పై గెలిచి మళ్ళీ విజయాల బాట పట్టింది. నేడు పంజాబ్ తో మరో కీలక పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్ లో గిల్ పర్వాలేదనిపిస్తున్నా భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్న సాయి సుదర్శన్ నిలకడగా రాణించడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. గత మ్యాచ్ లో మిల్లర్ ఫామ్ లోకి రావడం ఊరటనిస్తోంది. ఓపెనర్ సహా మెరుపు ఆరంభాలను ఇస్తున్నాడు. వీరందరూ మరోసారి రాణిస్తే గుజరాత్ కు తిరుగుండదు. గుజరాత్ బలమంతా వారి బౌలింగ్ అని చెప్పుకోవాలి. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు ఈ జట్టులో ఉన్నారు. మోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ లో నిలకడగా రాణిస్తున్నాడు. ఉమేష్ యాదవ్ గాడిలో పడితే బౌలింగ్ సమస్యలు తీరిపోయినట్టే.
పంజాబ్ కింగ్స్ :
టోర్నీలో బలహీనమైన జట్లలో పంజాబ్ ఒకటి. శిఖర్ ధావన్ మినహాయిస్తే ఆ జట్టులో అనుభవమున్న ప్లేయర్లు లేరు. ధావన్ తో పాటు సామ్ కరణ్ నిలకడగా రాణిస్తున్నాడు. బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పటివరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఇక బౌలింగ్ లో హరిప్రీత్ బ్రార్ ఒక్కడే రాణిస్తున్నాడు. అర్షదీప్, రబడా లాంటి పేసర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.
Also Read:లంక క్లీన్‌స్వీప్..రెండో టెస్టులో బంగ్లాదేశ్ చిత్తు
ఆదుకుంటాడనుకున్న రాహుల్ చాహర్ విఫలమవుతున్నాడు. బౌలింగ్ లో గాడిలో పడకపోతే పంజాబ్ ఈ మ్యాచ్ లో ఓడిపోవడం ఖాయం. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో గెలిచి శుభారంభం చేసినా ఆ తర్వాత వరుసగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జయింట్స్ చేతిలో పరాజయం పాలైంది.
రెండు జట్ల బలాబలాలను పరిశీలిస్తే ఈ మ్యాచ్ లో గుజరాత్ పటిష్టంగా కనిపిస్తుంది. సొంతగడ్డపై ఆడుతుండడం గుజరాత్ కు అనుకూలంగా మారింది. రషీద్ ఖాన్, గిల్, మోహిత్ శర్మ ఫామ్ మరో విజయాన్ని అందుకోవచ్చు. మరోవైపు పంజాబ్ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తేనే విజయం దక్కుతుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ కు 60 శాతం గెలిచే అవకాశాలు ఉంటే.. పంజాబ్ కు 40 శాతం ఉంది. ఎవరు గెలిచి రెండు పాయింట్స్ తమ ఖాతాలో వేసుకుంటారో చూడాలి.
IPL 2024: Gujarat Titans Vs Punjab Kings Match Live From Ahmedabad Today At 7.30 PM.. Who Will Win This Match.. Any Guess?#IPL2024 #GujaratTitans #PunjabKings pic.twitter.com/mjN35RgdDS
— Telugu News NOW (@telugu_newsnow) April 4, 2024