ఐపీఎల్ పదిహేడో సీజన్ రంజుగా సాగుతోంది. ఒకవైపు ఉత్కంఠ పోరాటాలు, ఆఖరి ఓవర్ థ్రిల్లర్స్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తుండగా.. మరోవైపు ప్లేఆఫ్ రేసు సినిమా క్లైమాక్స్ సీన్లను తలపిస్తోంది. ఇప్పటికే మూడు జట్లు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ దశకు చేరగా.. మిగిలిన ఒక స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ నెలకొంది.
బెంగుళూరు గెలిస్తే సరిపోదు..!
మే 18న శనివారం బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధిస్తే నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుంది. కానీ బెంగుళూరుది డిఫ్రెంట్ స్టోరీ. వారు గెలిస్తే సరిపోదు.. వారు తుదిపరి దశకు చేరుకోవాలంటే నెట్ రన్ రేట్ ఇక్కడ కీలక పాత్ర పోషించనుంది.
ఉదాహరణకు మొదట చెన్నై బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేసిందనకుంటే.. ఆ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 11 బంతులు మిగిలుండగానే ఛేదించాలి. ఒకవేళ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అప్పుడే రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్స్ దశకు అర్హత సాధిస్తుంది. సొంతగడ్డపై ఆడుతుండటం కోహ్లీ జట్టుకు కలిసొచ్చేదే అయినా.. 18 పరుగుల తేడాతో ఓడించడం లేదా 18 ఓవర్లలోనే చేధించడమనేది అంత సులువైన పని కాదు. పై లెక్కల ప్రకారం.. చెన్నై జట్టు ఓడినప్పటికీ.. ఒక్క పరుగును కాపాడుకున్నా తదుపరి దశకు చేరుకుంటుంది.
RCB Qualification Scenario for Playoffs in this IPL 2024: pic.twitter.com/k6P9otYZs7
— Tanuj Singh (@ImTanujSingh) May 17, 2024
కన్నేసిన వరుణుడు
ప్లేఆఫ్స్ రేసును నిర్ణయించే మ్యాచ్.. అందునా ధోనీ -కోహ్లి మధ్య పోరు కావడంతో మ్యాచ్‌పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ అదే జరిగితే, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. దీంతో క్రికెట్ అభిమానులందరూ ఒక్క రోజు విరామం తీసుకోమని వరుణ దేవుణ్ని ప్రార్థిస్తున్నారు.