IPL 2024: అనుభవానికి ఓటేసిన షారుఖ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్లను ప్రకటించిన కేకేఆర్

IPL 2024: అనుభవానికి ఓటేసిన షారుఖ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్లను ప్రకటించిన కేకేఆర్

ఐపీఎల్‌ 2024కు సంబంధించి మరో ఐదు రోజుల్లో మినీ వేలం జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 19న దుబాయి వేదికగా మినీ యాక్షన్ జరగనుంది. ఈ వేలంలో ఐపీఎల్ ప్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసి.. కొత్త సారథులను నియమిస్తారనుకుంటే పాత వారికే ఓటేసింది. వెన్ను నొప్పి కారణంగా గత సీజన్‌కు దూరమైన శ్రేయస్‌ అయ్యరే తమ జట్టు కెప్టెన్‌ అని ప్రకటన చేసింది. అతడికి డిప్యూటీగా నితీశ్ రాణా వ్యవహరిస్తాడని తెలిపింది.

గాయం కారణంగా గత ఎడిషన్‌కు అయ్యర్ దూరమవ్వడం దురదృష్టకరమన్న కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్, దాని నుంచి కోలుకునేందుకు అతను కష్టపడిన విధానం ప్రశంసనీయమని చెప్పుకొచ్చారు. కెప్టెన్‌గా అతడు మళ్లీ బాధ్యతలు చేపట్టి జట్టును విజయపథంలో నడిపిస్తాడనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. 

"గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ గత సీజన్‌లో ఆడలేకపోయాడు. అది నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు అతడు దాని నుంచి కోలుకున్నాడు. ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ సాధించి తిరిగి జట్టులో చేరాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. అతనికి మళ్ళీ కెప్టెన్సీ అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే, కెప్టెన్సీ వదులుకొని అయ్యర్ నాయకత్వంలో పనిచేసేందుకు అంగీకరించిన నితీశ్ రాణాకు అభినందనలు. అతన్ని వైస్‌ కెప్టెన్‌గా నియమించాం.." అని కేకేఆర్‌ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది.

కాగా, గత సీజన్‌లో అయ్యర్ గైర్హాజరీతో కేకేఆర్ పగ్గాలు అందుకున్న రాణా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. అతని సారథ్యంలో నైట్‌రైడర్స్ 14 మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అంతకుముందు 2022 సీజన్‌లో శ్రేయస్‌ నాయకత్వంలోనూ కేకేఆర్ ఏడో స్థానానికే పరిమితమైంది.