భారత స్టార్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు చేరుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డును అధిగమించాడు. ఐపీఎల్-2024లో భాగంగా శుక్రవారం(ఏప్రిల్ 19) చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులు చేసిన రాహుల్.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ధోని ఇప్పటివరకూ 24 సార్లు యాభైకి పైగా స్కోర్లు చేయగా.. రాహుల్ 25 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు.
ఐపీఎల్‌లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన వికెట్ కీపర్లు
- కేఎల్ రాహుల్: 25 హాఫ్ సెంచరీలు (125 మ్యాచ్‌లు)
- ఎంఎస్ ధోని: 24 హాఫ్ సెంచరీలు (257 మ్యాచ్‌లు)
- క్వింటన్ డికాక్: 23 హాఫ్ సెంచరీలు (103 మ్యాచ్‌లు)
- దినేష్ కార్తీక్: 21 హాఫ్ సెంచరీలు (249 మ్యాచ్‌లు)
- రాబిన్ ఉతప్ప: 18 హాఫ్ సెంచరీలు (205 మ్యాచ్‌లు)
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట రవీంద్ర జడేజా(57), మొయిన్ అలీ(30), ఎంఎస్ ధోని(28) రాణించడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని లక్నో బ్యాటర్లు 19 ఓవర్లలోనే చేధించారు. ఛేదనలో కేఎల్ రాహుల్(82), క్వింటన్ డికాక్(54) హాఫ్ సెంచరీలు చేశారు.