ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం(మార్చి 30) లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయి. ఇరు జట్ల బలాబలాలేంటి..? అనేది చూద్దాం..
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమై వారం రోజులు గడిచిపోయాయి. ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు జరగ్గా.. ఒక్కదానిలో మాత్రమే హోమ్ గ్రౌండ్ జట్టు పరాజయం పాలైంది. ఈ లెక్కన చూస్తే సొంత గడ్డపై ఆడుతున్న జట్లకు విజయావకాశాలు ఎక్కువ అన్నమాట. అలా అని ప్రత్యర్థి జట్లను కొట్టిపారేయలేం.
పేలవంగా లక్నో బౌలింగ్
క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడాల రూపంలో లక్నో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్నప్పటికీ.. బౌలింగ్ లో మాత్రం పస లేదు. కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ ఆ జట్టులో చెప్పుకోదగ్గ బౌలర్లు. మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్ లక్నో ప్రధాన పేసర్లు. ఈ ముగ్గురిలో ఒకరు రాణిస్తే మరో ఇద్దరు విపలమైనట్లే. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ అదే జరిగింది. మొహ్సిన్ ఖాన్(4 ఓవర్లలో 45 పరుగులు), నవీన్-ఉల్-హక్(4 ఓవర్లలో 41 పరుగులు), యశ్ ఠాకూర్(3 ఓవర్లలో 43 పరుగులు)ల త్రయం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. వీరిపైనే ఆధారపడితే రాహుల్ సేన గెలుపు బాట పట్టడం కాస్త కష్టమే.
పటిష్టంగా పంజాబ్
శిఖర్ ధావన్ ను మినహాయించినా.. జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సామ్ కుర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్ రూపంలో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. వీరికి తోడుగా ఆ జట్టులో అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడల రూపంలో ముగ్గురు నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. మరోవైపు పంజాబ్ కింగ్స్.. తమ మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 176 పరుగులను డిఫెండ్ చేయలేకపోయారు.
గూగుల్ గెలుపు అంచనాల ప్రకారం.. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో 54 శాతం లక్నో సూపర్ జెయింట్స్ గెలిచే అవకాశాలు ఉండగా, పంజాబ్ కింగ్స్ 46 శాతం ఉందని తెలిపింది. అయితే ఇదే జరుగుతుందని చెప్పలేం. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ వైపు మొగ్గు చూపవచ్చు.
జట్లు(అంచనా)
లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్/ వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్.
పంజాబ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్.