ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం(మే 08) సన్‌రైజర్స్ హైదరాబాద్.. లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మంగళవారం నగరంలో భారీ వర్షం కురిసినా.. బుధవారం వరుణుడి జాడ కనిపించలేదు. దీంతో అభిమానులు భారీగా స్టేడియానికి తరలివస్తున్నారు. దీంతో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఐదు ఓటములతో 12 పాయింట్లతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. ఆరు విజయాలు, ఐదు ఓటములతో నెట్ రన్ రేట్ ప్రకారం పాయింట్ల పట్టికలో లక్నో ఆరోస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇవాళ్టి విజయం రెండు జట్లకు కీలకం కానుంది. ఈ ఐపీఎల్ లో భారీ స్కోర్లు నమోదు చేస్తున్న హైదరాబాద్.. హోంగ్రౌండ్ లో మరో విక్టరీ నమోదు చేయాలని భావిస్తోంది. ఇటు రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు సూపర్ ఫాంను కొనసాగిస్తోంది.
ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం దాదాపుగా లేకపోవచ్చు. రెండు రోజులుగా హైదరాబాద్‌ను కుమ్మి వదిలేసిన వరుణుడు.. నేడు శాంతించినట్టే కనిపిస్తోంది. ఈ రాత్రి వరకూ హైదరాబాద్‌లో వర్షం పడటానికి అనుకూల వాతావరణం లేదు. ఆకాశం మేఘావృతమై కనిపించినప్పటికీ వర్షం పడకపోవచ్చు.