IPL 2024: ఒక్క బెర్త్ కూడా ఖరారు కాలేదు: 9 రోజుల్లో ముగియనున్న లీగ్ మ్యాచ్ లు

IPL 2024: ఒక్క బెర్త్ కూడా ఖరారు కాలేదు: 9 రోజుల్లో ముగియనున్న లీగ్ మ్యాచ్ లు

ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటివరకు 59 మ్యాచ్ లు ముగిసాయి. మొత్తం 10 జట్లలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మాత్రమే టోర్నీ అధికారికంగా నిష్క్రమించాయి. మిగిలిన 8 జట్లు రేస్ లో ఉన్నాయి. మరో 9 రోజుల్లో లీగ్ మ్యాచ్ లు ముగుస్తున్న ఇంకా ఒక్క ప్లే ఆఫ్ బెర్త్ కూడా ఖరారు కాకపోవడం ఐపీఎల్ క్రేజ్ ను తెలియజేస్తుంది. ప్లే ఆఫ్స్ కోసం 8 జట్లు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. 

ప్లే ఆఫ్ కు వెళ్లే జట్టు విషయానికి వస్తే రేస్ లో రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు జట్లు 11 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ లు గెలిచి దాదాపుగా తమ ప్లే ఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. మిగిలిన మూడు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ గెలిచినా అధికారికంగా ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మూడు మ్యాచ్ లు ఓడినా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ దశలో నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. 

ఈ రెండు జట్ల తర్వాత సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రన్ రేట్ ఉండడంతో మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ కు వెళ్తుంది. ఆడాల్సిన రెండు మ్యాచ్ లు సొంతగడ్డపై ఉండడం సన్ రైజర్స్ కు కలిసి రానుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన రెండు మ్యాచ్ ల్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. మూడు జట్లు కూడా ఆడిన 12 మ్యాచ్ ల్లో 6 విజయాలను సాధించాయి. నెట్ రన్ రేట్ మైనస్ లో ఉండడం ఢిల్లీ, లక్నోకు ప్రతికూలంగా మారింది.ఈ విషయంలో చెన్నై మిగిలిన రెండు జట్ల కంటే మెరుగ్గా ఉంది. 
 
ప్లే ఆఫ్ కోసం పోరాడుతున్న మరో రెండు జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్. రెండు జట్లు కూడా 12 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించాయి. ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లు గెలవడంతో పాటు మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. అద్భుతం జరిగితేనే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి.