ఐపీఎల్ పదిహేడో సీజన్ తుది అంకానికి రంగం సిద్ధమైంది. రెండు నెలలుగా అభిమానులను అలరించిన క్యాష్ రిచ్ లీగ్‌లో నేడు ఆఖరి సమరం జరగనుంది. లీగ్ దశలో టేబుల్ టాపర్లుగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు టైటిల్ పోరులో తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ ఇరు జట్లు పోరాడనున్నాయి. ఈ క్రమంలో అసలు ఐపీఎల్ ప్రైజ్ మనీ వివరాలేంటి..? ఫైనల్‌లో గెలిచిన జట్టుకు ఎంత దక్కుతాయి..? రన్నరప్‌కు ఎంత..? అనేది తెలుసుకుందాం..
ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్లు దక్కనున్నాయి. అదే ఓడిన జట్టు రూ. 13 కోట్లతో సరిపెట్టుకోవాల్సిందే. ఈ రెండింటితో పాటు మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ.6.5 కోట్లు ముట్టనున్నాయి.
ఐపీఎల్ 2024 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు
మొత్తం ప్రైజ్ పర్స్: రూ. 46.5 కోట్లు
- విజేత: రూ. 20 కోట్లు
- రన్నరప్: రూ. 13 కోట్లు
- మూడో స్థానంలో నిలిచిన జట్టు: రూ. 7 కోట్లు
- నాలుగో స్థానంలో నిలిచిన జట్టు: రూ. 6.5 కోట్లు
- ఆరెంజ్ క్యాప్: రూ. 15 లక్షలు
- పర్పుల్ క్యాప్: రూ 15 లక్షలు
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: రూ. 20 లక్షలు
- సీజన్ లో విలువైన ఆటగాడు: రూ. 12 లక్షలు
ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్
ప్రస్తుతం విరాట్ కోహ్లి(ఆర్సీబీ) 741 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది కోహ్లీనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవచ్చు. అలాగే, 24 వికెట్లతో హర్షల్ పటేల్ (పంజాబ్ కింగ్స్) పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా వీరిద్దరూ ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున అందుకోనున్నారు.