SRH vs PBKS: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన పంజాబ్

SRH vs PBKS: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన పంజాబ్

మే 19(ఆదివారం)న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్ కోసం పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. 30 ఏళ్ల వికెట్ కీపర్/ బ్యాటర్ జితేష్ శర్మ తమ కొత్త నాయకుడని అనౌన్స్ చేసింది. గాయం కారణంగా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ టోర్నీకి దూరమవ్వడం, అంతర్జాతీయ డ్యూటీ కోసం సామ్ కుర్రన్ ఇంగ్లాండ్‌ తిరిగి వెళ్లిపోవడంతో పంజాబ్ మేనేజ్మెంట్ ఈ ప్రకటన చేసింది.

ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు పూర్తిగా నిరాశ పరిచింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ విజయాలు సాధించలేకపోయారు. తొలి అర్ధభాగంలో టాఫార్డర్‌ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. అదే వారిని బాగా దెబ్బతీసింది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వంటి యువ క్రికెటర్లు అడపాదడపా రాణించినా.. వారిని దురదృష్టం వెంటాడింది. ఐదు మ్యాచ్ ల్లో ఆఖరి ఓవర్ లోనే వారు పరాజయం పాలయ్యారు. పంజాబ్ ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడగా..  5 విజయాలతో తొమ్మిదో (కింద నుండి రెండు) స్థానంలో ఉన్నారు. వీటిలో ఐదింటికి ధావన్, ఎనిమిదింటికి సామ్ కుర్రన్ నాయకత్వం వహించారు. చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తున్నారు. 

టాఫార్డరే ఆరంజ్ ఆర్మీ బలం

మరోవైపు, సన్‌రైజర్స్ ప్రదర్శన మాత్రం పంజాబ్‌కు భిన్నంగా సాగుతోంది. టాఫార్డర్‌ బ్యాటర్లే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడి భీకర ఫామ్ కొనసాగిస్తున్నారు. వీరిని పంజాబ్ బౌలర్లు ఏమేర కట్టడి చేస్తారో వేచి చూడాలి. ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడిన ఆరంజ్ ఆర్మీ.. 7 విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి రెండో స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది.