IPL 2024: రోహిత్ ఎప్పటికీ నాయకుడే.. సహచరుల్లో ఆత్మ విశ్వాసం నింపిన హిట్‌మ్యాన్

IPL 2024: రోహిత్ ఎప్పటికీ నాయకుడే..  సహచరుల్లో ఆత్మ విశ్వాసం నింపిన హిట్‌మ్యాన్

ప్రస్తుత సీజన్ లో(2024) ముంబై ఇండియ‌న్స్ ఎట్టకేల‌కు గెలుపు రుచి చూసిన విషయం తెలిసిందే. ఆదివారం(ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై 29 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 234 ప‌రుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేద‌న‌లో ఢిల్లీ 205 ప‌రుగులకే కుప్పకూలింది. ఈ విజయం అనంతరం ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులను ఉద్దేశిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.   

ఈ సీజ‌న్ నుంచి ముంబై కొత్త సంప్రదాయానికి తెర‌తీసింది. మ్యాచ్‌లో రాణించిన ఆట‌గాళ్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో స్పెష‌ల్ మెడల్ అందిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మకు బెస్ట్ ప్లేయర్ మెడ‌ల్ అంద‌జేశారు. బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ఇన్నింగ్స్ ఆడినందుకు రోహిత్‌కు అందించామ‌ని కోచ్ మార్క్ బౌచ‌ర్ అనౌన్స్ చేయ‌గా.. బ్యాటింగ్ కోచ్ కీర‌న్ పొలార్డ్ మెడల్ అంద‌జేశారు. ఇది జరిగిన అనంతరం సీనియర్ ప్లేయర్‌గా సహచరులను ఉదేశిస్తూ నాలుగు మాట్లాడాలని మార్క్ బౌచ‌ర్.. రోహిత్‌ను కోరారు. అందుకు సరేనన్న హిట్‌మ్యాన్.. తన ప్రసంగంతో సహచరుల్లో ఆత్మ విశ్వాసాన్ని నూరిపోశారు. 

"ఇది అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన. గేమ్ వన్ నుండి మనమందరం కోరుకుంటోంది ఇదే. వ్యక్తిగత ప్రదర్శనలు పర్వాలేదు కానీ, స‌మిష్టిగా పోరాడితే మరిన్ని విజ‌యాలు సాధించ‌వ‌చ్చు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతు స‌హ‌కారాన్ని అందిస్తే ల‌క్ష్యాన్ని చేరుకోగలం. ఈ రోజు మనం అలాంటి గెలుపు సాధించగలిగాం.. ఇది మనం చాలా కాలంగా మాట్లాడుకుంటున్న విషయమే. బ్యాటింగ్ కోచ్ (పొలార్డ్), మార్క్ (బౌచర్), కెప్టెన్ (పాండ్యా) కోరుకునేది ఇదే.." అని రోహిత్ మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్.. అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.