IPL 2024: వ్యూస్ కోసం నీచపు పనులు.. స్టార్ స్పోర్ట్స్‌‌పై రోహిత్ సీరియస్

 IPL 2024: వ్యూస్ కోసం నీచపు పనులు.. స్టార్ స్పోర్ట్స్‌‌పై రోహిత్ సీరియస్

క్రికెటర్ల ప్రైవేట్ సంభాషణలను రికార్డ్ చేసి వైరల్ చేయడానికి యత్నించిన స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెటర్ల జీవితాలు చాలా అనుచితంగా మారాయని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా ప్రసారాలు జరుగుతున్నాయని వాపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో హిట్‌మ్యాన్ సుదీర్ఘ ట్వీట్ పోస్ట్ చేశారు. 

ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్  తో మ్యాచ్‌కు ముందు రోహిత్, అభిషేక్ నాయర్ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్ అయ్యింది. 37 ఏళ్ల హిట్ మ్యాన్ ముంబై ఇండియన్స్‌కు తన చివరి సీజన్‌ను ఆడాలని సూచించినట్లు అందులో అనిపించింది. వెంటనే ఆ వీడియో తీసివేసినప్పటికీ.. అప్పటికే జరగారని నష్టం జరిగిపోయింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు  రోహిత్.. ధావల్ కులకర్ణితో సంభాషస్తుండగా కెమెరామెన్ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వద్దని వారించారు. చేతులెత్తి దండం పెడుతూ.. ప్రైవసీ ఇవ్వమని కోరారు.

ఈ ఘటనలపై రోహిత్ శర్మ.. తాజాగా స్పందించారు. తమ టీఆర్పీ రేటింగ్‌ల కోసం బ్రాడ్‌కాస్టర్లు క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతను బహిరంగ పరుస్తున్నారని విమర్శించారు.

"క్రికెటర్ల జీవితాలు చాలా అనుచితంగా మారాయి. ఆటగాళ్లు శిక్షణలో లేదా మ్యాచ్ రోజుల్లో స్నేహితులు, సహోద్యోగులతో మాట్లాడే ప్రతి అడుగు, ప్రతి సంభాషణను కెమెరాలు రికార్డ్ చేస్తున్నాయి. నా సంభాషణను రికార్డ్ చేయవద్దని స్టార్ స్పోర్ట్స్‌ని కోరినప్పటికీ, అది గోప్యతకు భంగం కలిగించే విధంగా ప్రసారం చేయబడింది. ఇలాంటి చర్యలు ఏదో ఒకరోజు అభిమానులకు..క్రికెటర్లు, క్రికెట్ మధ్య నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.." అని రోహిత్ శర్మ ట్వీట్ చేశారు. ఈ విషయం తీవ్ర వివాదాస్పదమవుతోంది.

ఒక ఐపీఎల్ పదిహేడో సీజన్ లో రోహిత్ ప్రదర్శన విషయానికి వస్తే, 14 మ్యాచ్‌ల్లో 32.08 సగటుతో 417 పరుగులు చేశాడు. సూపర్ జెయింట్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 38 బంతుల్లో 68 పరుగులు చేశాడు. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా రోహిత్ తిరిగి ఫామ్‌లోకి రావడం మెన్ ఇన్ బ్లూకు శుభసూచకం.