ఐపీఎల్ లో నేడు సూపర్ ఫైట్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జయింట్స్ తలపడుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. సాయంత్రం 7:30లకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లు బలంగా ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ప్రస్తుత ఐపీఎల్ లో సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. తొలి మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓడిన ఆర్సీబీ.. తర్వాత పంజాబ్ తో గెలిచి బోణీ కొట్టింది. అయితే కేకేఆర్ తో ఆడిన మ్యాచ్ లో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్ పరంగా కోహ్లీ, దినేష్ కార్తీక్ మినహాయిస్తే ఏ ఒక్కరు కూడా పెద్దగా రాణించడం లేదు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్ వెల్, రజత్ పటిదార్ దారుణంగా విఫలమవుతున్నారు. వీళ్ళ మీద ఆర్సీబీ యాజమాన్యం ఎన్నో ఆశలు పెట్టుకుంటే వీరు మాత్రం జట్టుకు భారంగా మారుతున్నారు. నేడు జరిగే మ్యాచ్ లో వీరు రాణిస్తేనే ఆర్సీబీ గెలుపు బాట పడుతుంది. గ్రీన్, అనుజ్ రావత్ పర్వాలేదనిపిస్తున్నారు.
ఈ జట్టు బౌలింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మయాంక్ దాగర్ ఒక్కడే పర్వాలేదనిపిస్తున్నా మిగిలిన వారు ఘోరంగా విఫలమవుతున్నారు. స్టార్ బౌలర్ సిరాజ్, 11 కోట్లు పెట్టి కొనుకున్న అల్జారీ జోసెఫ్, యువ పేస్ బౌలర్ యష్ దయాళ్ ఏ మాత్రం ప్రభావం చూపించడం లేదు. వికెట్లు తీయకపోగా ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మూడు మ్యాచ్ ల్లో ఈ త్రయం విఫలమవడం బెంగళూరు జట్టును కలవరానికి గురి చేస్తుంది. నేడు జరిగే మ్యాచ్ లో జోసెఫ్ ను పక్కన పెట్టి న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గుసన్ కు తుది జట్టులో అవకాశం దక్కొచ్చు. మరోవైపు యష్ దయాళ్ స్థానంలో ఆకాష్ దీప్ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం కనిపిస్తుంది.
లక్నో సూపర్ జయింట్స్:
రాహుల్ సారధ్యంలోని లక్నో సూపర్ జయింట్స్ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఓడిపోయింది. అయితే పూరన్ కెప్టెన్సీలో పంజాబ్ పై సూపర్ విక్టరీ కొట్టింది. రాహుల్ రెస్ట్ తీసుకోవడంతో పూరన్ కెప్టెన్సీలో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్ లో పూరన్ సూపర్ ఫామ్ లో ఉండడం.. చివరిసారిగా జరిగిన మ్యాచ్ లో డికాక్, స్టోయినీస్ మెరుపులు మెరిపించడంతో ఆ జట్టుకు పెద్దగా బ్యాటింగ్ సమస్యలు లేనట్టుగానే కనిపిస్తున్నాయి. పడికల్, ఆయుష్ బదోని బ్యాట్ ఝళిపిస్తే లక్నోకు తిరుగుండదు.
Also Read: సుమిత్‌కు.. కెరీర్ బెస్ట్ ర్యాంక్
బౌలింగ్ లో లక్నో పటిష్టంగా కనిపిస్తుంది. మయాంక్ యాదవ్, నవీన్ ఉల్ హక్, మెషిన్ ఖాన్ అనుభవం లేకపోయినా అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ తన ఐపీఎల్ తొలి మ్యాచ్ లోనే ఎక్స్ ప్రెస్ పేస్ తో పంజాబ్ ను వణికించాడు. ఇక స్పిన్నర్లుగా బిష్ణోయ్, క్రునాల్ పాండ్య అదరగొట్టేస్తున్నారు. వీరందరూ ఒక మ్యాచ్ లో రాణిస్తే మరొక మ్యాచ్ లో విఫలమవడం మైనస్ గా మారింది. అందరూ ఈ మ్యాచ్ లో నిలకడగా రాణిస్తే లక్నో గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
రెండు జట్లను పరిశీలిస్తే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా ఉన్న లక్నో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు సొంతగడ్డపై బెంగళూరు జట్టును ఓడించాలంటే శక్తికి మించిన పని. లక్నోకు 60 శాతం విజయావకాశాలు ఉంటే.. బెంగళూరు కు 40 శాతం గెలిచే ఛాన్స్ ఉంది. మరి ఎవరు గెలిచి ఈ టోర్నీలో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటారో చూడాలి.
Royal Challengers Bengaluru vs Lucknow Super Giants, 15th Match
— SPORTS WIZ (@mysportswiz) April 1, 2024
Match Details:
Date: Tuesday, April 02, 2024.
Time: 07:30 PM (IST)
Location: M. Chinnaswamy Stadium, Bengaluru.#RCBvsLSG #ViratKohli #GOAT𓃵 pic.twitter.com/M8l2ZoZMIK