కోహ్లీ సెంచరీ కొట్టినా బెంగళూరు గెలవలేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్‌లో తన వందో మ్యాచ్‌లో జోస్ బట్లర్ సెంచరీతో దంచికొట్టి రాజస్తాన్‌ను గెలిపించాడు.
జైపూర్: సెంచరీల మోతలో ‘కింగ్’ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్‌దే పైచేయి అయింది. ఓవైపు విరాట్ కోహ్లీ (71 బాల్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 నాటౌట్).. మరోవైపు జోస్ బట్లర్ (58 బాల్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను విజయం వరించింది. సంజూ శాంసన్ (42 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) కూడా బ్యాట్ ఝుళిపించడంతో.. శనివారం జరిగిన పోరులో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి వరుసగా నాలుగో విజయం సాధించింది. టాస్ ఓడిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 183/3 స్కోరు చేసింది. డుప్లెసిస్ (33 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) ఫర్వాలేదనిపించాడు. రాజస్తాన్ 19.1 ఓవర్లలో 189/4 స్కోరు చేసి నెగ్గింది. ఐపీఎల్‌లో తన వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన బట్లర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
కోహ్లీ కేక..
స్టార్టింగ్‌లో ఆర్‌సీబీ ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ దంచికొట్టినా, చివర్లో రాజస్తాన్ బౌలర్లు భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశారు. డుప్లెసిస్ ఫోర్‌తో ఖాతా తెరిస్తే, కోహ్లీ రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత విరాట్ 4, 6, 4, డుప్లెసిస్ బౌండ్రీతో పవర్‌ప్లేలో బెంగళూరు 53/0 స్కోరు చేసింది. 9వ ఓవర్‌లో డుప్లెసిస్ 6, 6.. తర్వాతి ఓవర్‌లో కోహ్లీ సిక్స్ కొట్టారు. పరాగ్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో 39 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ మరో రెండు ఫోర్లతో రెచ్చిపోయాడు. కానీ 14వ ఓవర్‌లో డుప్లెసిస్‌ను ఔట్ చేసిన చహల్ (2/34) తొలి వికెట్‌కు 125 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. మ్యాక్స్‌వెల్ (1) మళ్లీ ఫెయిలవడంతో ఆర్‌సీబీ 128/2 స్కోరుతో నిలిచింది. సౌరవ్ చౌహాన్ (9)కూడా ఔటైనా.. విరాట్ 67 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. 154/3 స్కోరు వద్ద వచ్చిన కామెరూన్ గ్రీన్ (5*) భారీ షాట్లు కొట్టకపోయినా చివరి ఓవర్‌లో కోహ్లీ 4, 4, 4తో 14 రన్స్ రాబట్టడంతో ఆర్‌సీబీ మంచి స్కోరే చేసింది.
148 రన్స్ పార్ట్‌నర్‌షిప్..
ఛేజింగ్‌లో ఇన్నింగ్స్ రెండో బాల్‌కే యశస్వి (0) డకౌటైనా.. బట్లర్, శాంసన్ ఆర్‌సీబీ బౌలింగ్‌ను ఉతికేశారు. స్టార్టింగ్‌లో ఇద్దరు ఫోర్లతో టచ్‌లోకి రాగా.. ఆరో ఓవర్‌లో బట్లర్ 4, 4, 6, 4తో 20 రన్స్ కొట్టి జోరు పెంచాడు. దీంతో పవర్‌ప్లేలో రాయల్స్ 54/1 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి శాంసన్ 4, 4, 6తో జోరందుకున్నాడు. నాలుగు ఓవర్లలో 41 రన్స్ రావడంతో ఫస్ట్ టెన్‌లో రాజస్తాన్ 95/1తో మంచి స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో బట్లర్ 30, శాంసన్ 33 బాల్స్‌లో హాఫ్ సెంచరీలు అందుకున్నారు. 11వ ఓవర్‌లో అదే జోరును కంటిన్యూ చేసిన శాంసన్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. బట్లర్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో రెచ్చిపోయాడు. కానీ 14 ఓవర్‌లో శాంసన్ ఔట్‌తో రెండో వికెట్‌కు 148 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 9 బాల్స్ తేడాలో రియాన్ పరాగ్ (4), ధ్రువ్ జురెల్ (2) వెనుదిరగడంతో కాస్త టెన్షన్ మొదలైంది. విజయానికి 20 రన్స్ కావాల్సిన దశలో హెట్‌మయర్ (11*) రెండు ఫోర్లు బాదగా, బట్లర్ విన్నింగ్ సిక్స్ కొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 183/3 (కోహ్లీ 113*, డుప్లెసిస్ 44, చహల్ 2/34).
రాజస్తాన్: 19.1 ఓవర్లలో 189/4 (బట్లర్ 100*, శాంసన్ 69, టాప్లీ 2/27).
- ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది ఎనిమిదో సెంచరీ. లీగ్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డు అతనిదే. క్రిస్ గేల్, జోస్ బట్లర్ 6 సార్లు వంద కొట్టి సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఓవరాల్‌గా ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్‌గా కోహ్లీ రికార్డుకెక్కాడు. ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ క్లింగర్ (8 సెంచరీలు) రికార్డు బ్రేక్ చేశాడు.
- ఐపీఎల్‌లో 7500 రన్స్ చేసిన తొలి క్రికెటర్ విరాట్. ప్రస్తుతం అతని ఖాతాలో 7579 రన్స్ ఉన్నాయి. శిఖర్ ధవన్ 6755 రన్స్‌తో రెండో ప్లేస్‌లో ఉన్నాడు.