ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు T20 క్రికెట్‌లో ఫ్రాంచైజీకి అత్యధిక యాభై(అర్థశతకం) ప్లస్ స్కోర్ చేసిన రికార్డు జోస్ బట్లర్ పేరిట ఉంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఏప్రిల్ 10వ తేదీ బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్ అర్థ శతకంతో చెలరేగి బట్లర్ రికార్డును అధిగమించాడు.
ఈ మ్యాచ్ లో కేవలం 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్‌లతో శాంసన్ అజేయంగా 68 పరుగులు చేశాడు. ఇది రాజస్థాన్ రాయల్స్ తరపున శాంసన్ చేసిన 23వ అర్ధశతకం కాగా.. రెండు సెంచరీలతో సహా 25వ ఫిఫ్టీ ప్లస్ స్కోరు. దీంతో రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధికంగా యాభై ప్లస్ స్కోర్ చేసిన క్రికెటర్ గా శాంసన్ నిలిచాడు.
ఇక, జోస్ బట్లర్.. రాజస్థాన్ రాయల్స్ తరపున 24 ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌లు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తంమీద, శాంసన్ ఫ్రాంచైజీ తరుపున 131 మ్యాచ్‌లలో 3,649 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 23 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్ లో శాంసన్ అద్భుత బ్యాటింగ్ తో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో 157.69 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 82తో సహా 3 అర్థశతకాలు ఉన్నాయి.
అలాగే, 50వ ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధిక స్కోరు సాధించిన కెప్టెన్ గా కూడా సంజూ రికార్డు సృష్టించాడు. అంతకుముందు కోల్ కతా కెప్టెన్ గా తన 50వ ఐపీఎల్ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్(59 పరుగలు) అర్థశతకం సాధించాడు.