IPL 2024: బ్యాటర్లకు ఇక చుక్కలే.. బౌలర్లకు అనుకూలంగా క్రికెట్‌లో కొత్త రూల్

IPL 2024: బ్యాటర్లకు ఇక చుక్కలే.. బౌలర్లకు అనుకూలంగా క్రికెట్‌లో కొత్త రూల్

సాధారణంగా టీ20 క్రికెట్ అంటే బౌండరీల వర్షం కురుస్తుంది. ఎంతటి బౌలర్ అయినా 20 ఓవర్ల ఆటలో బ్యాటర్లపై ఆధిపత్యం చూపించడం చాలా అరుదు. ఇక ఐపీఎల్ అయితే బ్యాటర్ల దెబ్బకు బౌలర్లు బలవ్వాల్సిందే. ఫ్రీ హిట్, పవర్ ప్లే అంటూ బ్యాటర్లకు ఎన్నోఅనుకూల మార్పులు చేయడం బౌలర్ల పాలిట శాపంగా మారింది. అయితే బౌలర్లకు ఊరటనిస్తూ ఐపీఎల్ లో బీసీసీఐ ఒక కొత్త రూల్ ప్రతిపాదించింది. 
 
దుబాయ్ వేదికగా మరి కొన్ని గంటల్లో ఐపీఎల్ ఆక్షన్ ప్రారంభమవుతుండగా.. బీసీసీఐ బ్యాట్, బంతి మధ్య పోరు రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇకపై ఒక ఓవ‌ర్లో ఫాస్ట్ బౌల‌ర్ల‌కు రెండు బౌన్స‌ర్లు సంధించేందుకు అనుమతించారు. ఇప్పటివరకు ఫాస్ట్ బౌలర్లు క్రికెట్ లో ఒక ఓవర్లో ఒక్క బౌన్సర్ మాత్రమే వేసే రూల్ ఉంది. ఈ ఏడాది జ‌రిగిన స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్ర‌తి ఓవ‌ర్‌లో రెండు బౌన్స‌ర్ల‌కు చాన్స్ ఇచ్చారు. ఈ ప్రయోగాత్మక రూల్ విజయవంతం కావడంతో ఐపీఎల్ 2024కు ఈ రూల్ కొనసాగనుందని బీసీసీఐ చెప్పుకొచ్చింది. 

ఈ ఏడాది(2023) ఐపీఎల్ లో ఇంపాక్ట్ రూల్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఫిట్ నెస్ లేని ప్లేయర్లకు, రెస్ట్ కావాలనుకున్నవారికీ ఏ రూల్ బాగా కలిసొచ్చింది. అయితే ఈ రూల్ కారణంగా ఆల్ రౌండర్లకు అవకాశాలు రావట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఓవర్ కు రెండు బౌన్సర్ల రూల్ బౌలర్లకు మారుతుందో లేదో చూడాలి.