ఐపీఎల్ వేలం కూడా ముగిసింది. వీడెంటి.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ గుడ్ బై అని ఇప్పుడు చెప్తున్నాడు అనుకుంటున్నారా! ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. సాధారణంగా ఐపీఎల్ వేలానికి ముందువరకూ సాగే ఐపీఎల్ ట్రేడ్ విండో మళ్లీ ఓపెన్ అయ్యింది. దీంతో ముంబై మాజీ కెప్టెన్ హిట్‌మ్యాన్ తమకంటే తమకు కావాలంటూ నాలుగు ఫ్రాంచైజీలు ముంబై యాజమాన్యం వెంట పడుతున్నాయట. ఈ చర్చలు సజావుగా సాగితే రేపో మాపో రోహిత్ ఫ్రాంచైజీ మారనున్నాడని సమాచారం.
ట్రేడ్ విండో అంటే ఏంటి..?
అసలు ట్రేడ్ విండో అంటే ఏంటి అంటారా! ఆటగాళ్ల బదిలీ కోసం తోటి ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరపడం అన్నమాట. నగదు రూపంలో కానీ, ఆటగాడి రూపంలో కానీ, ఈ బదిలీలు ఉంటాయి. ఉదాహరణకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుకుందాం.. రూ.11 కోట్లు వెచ్చించి వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌ను తీసుకుంది. ఇప్పుడు అతను వద్దనుకుంటోంది.. అతన్ని ముంబైకి ఇచ్చేసి వారు ఒప్పుకుంటే రోహిత్‌ను జట్టులోకి తీసుకుందాం అని చర్చలు జరపడం అనమాట. మరి అందుకు ఒప్పుంటారా అంటే అది వారి ఇష్టాయిష్టాన్ని బట్టి ఉంటుంది. ఇచ్చే మొత్తాన్ని, నచ్చిన ఆటగాడిని ఇస్తానంటే వారు అంగీకరించవచ్చు. ఇలానే మరో మూడు ఫ్రాంచైజీలు హిట్‌మ్యాన్ కోసం వేట మొదలుపెట్టాయి.
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించడం ఆ జట్టు అభిమానులకు, రోహిత్ ఫ్యాన్స్ కు ఏమాత్రం నచ్చలేదు. మరోవైపు, సోషల్ మీడియాలో ముంబై మేనేజ్మెంట్ పై వ్యతిరేకత పెరుగుతూనే వస్తోంది. కెప్టెన్సీ ఇస్తేనే గుజరాత్ నుంచి వస్తానని పాండ్యా కండిషన్ పెట్టాడం.. అందుకు ముంబై ఒప్పుకొని రోహిత్ కు సర్ది చెప్పిందనే వార్తలు బయటకు రావడం మరింత ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆ సమయంలో రోహిత్ జట్టు మారతాడని వార్తలు వినిపించినప్పటికీ, ముంబై యాజమాన్యం వాటిని కొట్టిపారేసింది. అయితే, అభిమానుల మనసు నొప్పించలేక హిట్ మ్యాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని సమాచారం. దీంతో అతని కోసం ఆర్‌సీబీ సహా మరో మూడు ఫ్రాంచైజీలు ముంబైతో చర్చలు సాగిస్తున్నాయట.
రేసులో సన్ రైజర్స్
పాండ్యా ముంబైకి ట్రేడ్ అవ్వగానే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రోహిత్ శర్మ ట్రేడ్ కోసం ప్రయత్నించిందని, కానీ కాంట్రాక్ట్ వల్ల డీల్ కుదరలేదని కొన్ని నివేదికలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అవకాశం రావడంతో క్యాపిటల్స్ మరోసారి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిందట. ఈ రేసులో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతని అభిమానులు కూడా రోహిత్ ముంబైని వదిలేసి ఆర్‌సీబీ, చెన్నై, సన్ రైజర్స్ వంటి జట్లకు వచ్చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతానికైతే రోహిత్ ముంబైకే ఆడేటట్టు కనిపిస్తున్నా, ఏదైనా జరగొచ్చని.. సంచలనం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫ్యాన్స్ అంటున్నారు.